- = ప్రభుత్వం గుర్తించిన వాహనాలకే అనుమతి
- = సొంత వాహనాల్లో ఇసుక రవాణాకు చెల్లుచీటీ
- = అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
- = పెరిగిన రవాణా చార్జీలు
- = ఇప్పటికే ఇసుక ధర పెంపు.. రవాణా పేరుతో అదనపు మోత
నెల్లూరు(బారకాసు): ఇసుక పేరుతో ప్రభుత్వం ప్రజలను నిలువుదోపిడీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. పాలకులు తీసుకుంటున్న విపరీత నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. సర్కారు తీరుతో ఇసుక మరింత భారం కానుంది.. ఇప్పటికే పెరిగిన రేట్లతో గృహ నిర్మాణదారులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు.. ఈనేపథ్యంలో రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం వారం క్రితం తాజా ఉత్తర్వులు విడుదల చేసింది.. ఈ ఉత్తర్వుల ప్రకారం రవాణా చార్జీల భారం గృహనిర్మాణదారులపై పడనుంది.. ఇప్పటికే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్, లారీల యజమానుల పరిస్థితి దయనీయంగా మారింది.. రిజిస్టర్ చేయించుకున్న వాహనాల ద్వారానే ఇసుక రవాణా చేయాలనే నిబంధన ఇందుకు కారణం. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి ఇసుక తరలించేందుకు వినియోగదారులు ఇంతకు ముందులా సొంత లేదా తమకు నచ్చిన అద్దె వాహనాలను వినియోగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లోనే.. అదీ ఇసుక ధరతో పాటు రవాణా ఖర్చులను ముందుగానే చెల్లించి
మరింత భారం
ఇసుక తీసుకెళ్లాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించడంతో జిల్లాలోని మొత్తం 42 రీచ్‌లలో ఈనెల 22 నుంచి అమలు చేశారు. ఈమేరకు అధికారులు ఆయా రీచ్‌ల పరిధిలో ఇసుక రవాణ చేసేందుకు ట్రాక్టర్ల, టిప్పర్ల(లారీ) వాహనాల యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.
నిబంధనలు ఇవే...
= ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సం ఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పు డు రవాణాను కూడా వారికే కట్టబెట్టింది.
= ఇసుక రవాణ చేయదలచుకున్న వారు సంబంధిత వెలుగు కార్యాలయల్లో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను నమోదు చేయించుకోవాలి.
= ఇసుక కొనుగోలుదారుల సొంత వాహనాలతో సహా ఇతరత్రా ఏవాహనాలను రవాణాకు అనుమతించరు.
= ఇసుక కావాల్సిన వారు ఇసుక ధరతో పాటు వాహనం అద్దెను ముందుగానే మీ-సేవా కేంద్రంలో చెల్లించి రసీదు తీసుకొస్తేనే సంబంధిత రీచ్‌ల నిర్వాహకులు ఇసుక లోడింగ్‌కు అనుమతిస్తారు.
= దూరాన్ని బట్టి రవాణాచార్జీలను సర్కా రే నిర్ణయించింది. దాని ప్రకారం ట్రాక్టర్లకైతే 5 కి.మీ వరకు రూ.400, 5 నుంచి 10కి.మీ వరకైతే రూ.600 ఆపైన ప్రతి కిలోమీటర్‌కు రూ.30 చొప్పున చెల్లించా లి.
అదేవిధంగా పదిటన్నుల ఇసుకను నింపిన టిప్పరు(లారీ)కు 5నుంచి 10 కి.మీ వరకు రూ.800 ఆపైన ప్రతి కిలోమీటరకు రూ.80 చొప్పున చెల్లించాలి. అలాగే 25 టన్నుల ఇసుక నింపిన టిప్పరు(లారీ)కి అయితే 5నుంచి10 కి.మీ వర కు రూ.1,200 ఆపైన ప్రతి కిలోమీటరకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు.
కొనుగోలుదారులకు భారం...
ఈవిధానం ఇసుక కొనుగోలుదారులకు భారంగా మారడంతో పాటు ఇసుక రవాణానే ఉపాధిగా చేసుకున్న వందలాది ట్రాక్టర్లు, లారీల యజమానుల పొట్టకొట్టనుంది. ఇప్పటివరకు ఇసుక రవాణాకు వాహనదారులతో బేరమాడి నచ్చిన చార్జీ చెల్లించే వెసులుబాటు ఉండేది. తాజా ఉత్తర్వులతో తప్పనిసరిగా నిర్ణీత ధర చెల్లించాల్సిందే. ఉదాహరణకు పొట్టేపాళెం, దేవరపాళెం రీచ్‌ల నుంచి నగరంలోకి ట్రాక్టర్ ఇసుక రవాణా చేయాలంటే ప్రభుత్వ ధర ప్రకారం రూ.2,650 చెల్లించాలి. దూరాన్ని బట్టి ఈమొత్తం పెరుగుతుంది. ఇదే ట్రాక్టరు ఇసుక ధర రూ1,850లే. అంటే ఇసుక కంటే రవాణా చార్జీలే తడిసిమోపెడన్నమాట.
కచ్చితంగా అమలు
వాస్తవంగా ఈ నిబంధనలు రీచ్‌లు ప్రారంభించనప్పటి నుంచే ఉన్నాయి. అయితే ఈనిబంధనలను ఈ నెల 22 నుంచే కచ్చితంగా పాటించాలని ఉన్నతాధికారుల ఆదేశించారు. దీంతో జిల్లాలో ఆరోజు నుంచే ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలు అమలుచేస్తున్నాం. ఆమేరకు ఇసుక ధర, రవాణా చార్జీలు కలిపి వినియోగదారుడు మీ-సేవలో చెల్లించి ఆయా రీచ్‌లలో రసీదు అందచేస్తేనే ఇసుక సరఫరా చేస్తాం.
- డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి