సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించాయి. 14ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి రికార్డు నెలకొల్పామని ఏపీ జెన్‌కో(మోతుగూడెం) చీఫ్ ఇంజినీర్ బి.కృష్ణయ్య అన్నారు.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలో మాచ్‌ఖండ్, ఎగువసీలేరు, డొంకరాయి, పొల్లూరు విద్యుత్ కేంద్రాల్లో రికార్డును సృష్టించి 448మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, ఈ ఘనత సాధించిన రెండు, మూడురోజుల్లోనే మరో రికార్డును సొంతం చేసుకున్నామని తెలిపారు. సీలేరు జలవిద్యుత్‌కేంద్రం రోజువారీ ఉత్పత్తిలో 6- 8మిలియన్ యూనిట్లు కాగా మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం వరకు 9.478మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేసి 14ఏళ్లనాటి చరిత్రను పునరావృతం చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రిజర్వాయర్లలో మన వాటానీరు పుష్కలంగా ఉందని, దానికి మించి అన్ని యూనిట్లు నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని, అందుకే ఈ ఘనత సాధించగలిగామన్నారు. జాతీయస్థాయిలో మరోసారి ఈ ఏడాది అవార్డు పొందేందుకు మరింత కృషిచేస్తామని ఆయన అన్నారు. బుధవారం మాచ్‌ఖండ్, ఎగువసీలేరు, దిగువసీలేరు, పొల్లూరుల్లో ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మాచ్‌ఖండ్‌లో మూడు యూనిట్ల ద్వారా 1.097మిలియన్ యూనిట్లు, ఎగువ సీలేరులో నాలుగు యూనిట్ల ద్వారా 2.402 మిలియన్ యూనిట్లు, డొంకరాయిలో ఒక యూనిట్ ద్వారా 0.441మిలియన్ యూనిట్లు, పొల్లూరులో నాలుగు యూనిట్ల ద్వారా 5.538 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
విద్యుదుత్పత్తిలో రికార్డు
Published Thu, Apr 3 2014 12:37 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM
Advertisement