ఖాజీపేట : ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో అటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పూర్తిగా విఫలమవుతూనే ఉన్నారు. నామమాత్రం గా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో స్మగ్లర్లు తమదైన సమాచారంతో ఎప్పటికప్పడు రవాణా మార్గాలు మార్చుకుంటూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ఖాజీపేట మండలం, మైదుకూరులోని కొండకు ఆనుకుని ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి అడ్డగా మారాయి. ఈ విషయం ఇటు ఫారెస్ట్ అధికారులకు స్థానిక పోలీసులకు బాగా తెలుసు. ఎందుకంటే కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారుల పైకి దుంగలను తీసుకు పోయేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. అందుకే స్మగ్లర్లు ఇదే రాచ మార్గంగా ఎంచుకుని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఎన్ని సార్లు దుంగలు పట్టుకున్నా రహదారులు మార్చుతున్నారు తప్ప అక్రమ రవాణా మాత్రం ఆగక పోవడం విశేషం.
రూటు మార్చిన తమిళ కూలీలు
స్థానిక, బడా స్మగ్లర్లు తమిళ కూలీలను అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారన్నది అధికారులందరికి తెలిసిన విషయమే. గతంలో కన్నెల వాగు చెరువు నుంచి వచ్చిన ఎర్రచందనం దుంగలను పంట పొలాల గుండా తీసుకు వచ్చి పొలాల్లో లేక హైవే కల్వర్టుల వద్ద ఉంచి క్షణాల్లో వాహనాల్లోకి ఎక్కించి రవాణా చేసేవారు. అలాగే తమిళ కూలీలు కొత్తనెల్లూరు, చెన్నూరు బ్రిడ్జి వద్ద నుంచి చక్కెర ఫ్యాక్టరీ మీదుగా, కొత్తపేట వద్ద హైవే పై నుంచి అడవుల్లోకి వెళ్లేవారు. తాజాగా వారు రహదారులు పూర్తిగా మార్చేశారు. నాగసానిపల్లె నుంచి అలాగే భూమాయపల్లె సమీపంలోని రహదారులు, కేసీ కాలువ, తెలుగుగంగ రహదారుల గుండా అడవుల్లోకి వెళుతున్నారు.. అలాగే అడవులనుంచి తీసుకు వచ్చిన దుంగలను నాగసానిపల్లె చిలకకనం వద్ద నుంచి చెన్నముక్క పల్లె వరకు ఉన్న తెలుగు గంగ కాలువలో, దాని పై భాగాన ఉన్న అడవి మార్గంలో దాచుతున్నారు. అలా దాచిన దుంగలను వాహనం వచ్చిన వెంటనే వాహనంలోకి లోడ్ చేసి ప్రధాన రహదారి గుండా రాజమార్గంలో రవాణా చేస్తున్నారు.
పోలీసులకు దొరికి భారీ డంప్
తెలుగు గంగ కాలువలో గత బుధవారం ఖాజీపేట పోలీసులు జరిపిన కూంబింగ్ లో భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 71 దుంగలు తెలుగు గంగ కాలువలో లభ్యమయ్యాయి. అందులో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో ఇద్దరు స్థానిక స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే దొరికిన తమిళ కూలీల్లో ఒకరిని ఎలాంటి విచారణ జరపకుండా 26వ తేదీనే కేసు నమోదు చేసి జైలుకు పంపడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పోలీసులకు దుంగలు దొరకడం ఇదే ప్రథమం. అలాంటిది తెరవెనుక పాత్రధారుల పై విచారణ ఎందుకు జరపలేదని అందరూ ప్రశ్నిస్తున్నారు.
పండుగలే టార్గెట్
స్మగ్లర్లు పండుగలను టార్గెట్ చేసుకుని రవాణా భారీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వినాయక చవితి అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసుల నిఘా పూర్తిగా తగ్గింది. అలాగే కూంబింగ్ కూడా సక్రమంగా లేదు. ఈ సమయాల్లో నే అత్యధికంగా రవాణాకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
స్మగ్లర్ల పాత్రపై దర్యాప్తు ఏదీ..
ఇటీవల నమోదైన కేసులను పరిశీలిస్తే కేవలం తమిళ కూలీలను మాత్రమే అరెస్టు చూపుతున్నారు. దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెబు తున్నారు తప్ప తెర వెనుక ఉన్న స్మగ్లర్లను బయటకు తీయడంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విఫలమవుతున్నారు. ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన తమిళకూలీలు ఇక్కడ నుంచి ఇంత దర్జాగా రవాణా చేస్తున్నారంటే తెరవెనుక స్థానికులతోపాటు బడా స్మగ్లర్ల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. అయితే తమిళ కూలీలకు చేయూతనందిస్తున్న స్థానికులు ఎవరు.. వారికి బడా స్మగ్లర్లతో ఉన్న లింకు ఏమిటి.. ఈ అక్రమ రవాణాలో ఎవ్వరి పాత్ర ఎంత అన్న దాని పై నిఘా పూర్తిగా తగ్గింది. దీంతో దొరికితే జైలుకు వెళ్లేది తమిళ కూలీలే కదా అంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిఘా పెంచి స్మగ్లర్ల ఆటకట్టించి ఎంతో విలువైన ఎర్రచందనాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఫారెస్ట్ అధికారుల నిఘా ఏమైంది..
అడవుల్లోని ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా అటవీ శాఖ అధికారులపై ఉంది. అయితే గత ఏడాది గా నిఘా పూర్తిగా విఫలమైందని స్థానికులు అంటున్నారు. 2017 మార్చి నుంచి మే వరకు జరిగిన దాడుల్లో ఫారెస్ట్ అధికారులు సుమారు 300 మంది తమిళకూలీలను అరెస్టు చేయడంతో పాటు 400 దుంగలను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. అలాగే పోలీసులు కూడా సుమారు 100 మందికి పైగానే అరెస్ట్ చేశారు. అయితే గత ఏడాది గా పరిశీలిస్తే ఎలాంటి దాడులు లేవు. నామమాత్రంగా దాడులు చేసి తరువాత చేతులు ఎత్తేస్తున్నట్లు సమాచారం. దీంతో తమిళ కూలీలు వందల సంఖ్యలో బ్యాచ్‌లుగా విడిపోయి వివిధ మార్గాల ద్వారా అడవుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment