సాక్షి, కడప/ కడపఅర్బన్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం అక్రమ రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. రోజూ పదుల టన్నుల సంఖ్యలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ స్మగ్లర్లు పట్టుబడుతుండగా దానికి నాలుగు రెట్లు పైగా ఎర్రచందనం ఎల్లలు దాటుతోంది. దీనికి ప్రధానంగా రాజకీయ పార్టీ నేతల అండతోపాటు పోలీసులు, అటవీ సిబ్బంది పాత్ర, స్థానికుల సహకారం ఉండటంతో దీని నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు అటవీ చట్టాల్లో పసలేక పోవడం, సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం స్మగ్లర్లకు కలిసి వస్తోంది. దీంతో పోలీసులు, అటవీ సిబ్బంది ద్వితీయస్థాయి స్మగ్లర్లను, కూలీలను అరకొరగా పట్టుకుంటున్నా ప్రధాన సూత్రధారులను పట్టుకోలేక పోవడంతో అక్రమ రవాణాకు తెరపడటం లేదు.
ప్రపంచలోనే అరుదైన ఈ వృక్ష సంపద జిల్లాలోని మూడు డివిజన్ ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో విస్తరించి ఉంది. ముఖ్యంగా బద్వేలు, సిద్దవటం, రాజంపేట, చిట్వేలి, రైల్వేకోడూరు, మద్దిమడుగు, పుల్లమడుగు, ఖాజీపేట, వీరబల్లి, సానిపాయి, సుండుపల్లె, సంబేపల్లె, గువ్వలచెరువు ప్రాంతాల్లోని అడవుల్లో ఈ ఎర్రదోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. కడప, ప్రొద్దుటూరు డివిజన్‌లలో 2002-03 నుంచి 2011-12 సంవత్సరాల వరకు పది సంవత్సరాల కాలంలో 3602 కేసులను నమోదు చేశారు. ఈ కేసుల్లో 4425.696 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంకెంత ఎర్రచందనం బయటి ప్రాంతాలకు తరలిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పది సంవత్సరాలలో తరలిస్తూ పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2614.306 కోట్లుగా లెక్కగట్టారు. ఈ సంఘటనల్లో 1601 వాహనాలను సీజ్ చేసి 4087 మందిని అరెస్టు చేశారు.
ఎర్రదోపిడీ జరుగుతోందిలా!
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా నాలుగు దశల్లో సాగుతోంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఫెల్లర్స్ (కూలీలు), కేటగిరి-1 స్మగ్లర్లు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తారు. అటవీ ప్రాంతంలో కొట్టిన ఎర్రచందనాన్ని కేటగిరి-2 స్థాయి స్మగ్లర్లు టన్ను రూ. 4 నుంచి 5 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తారు. కొన్నిచోట్ల దిగువస్థాయి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని దుంగలుగా తయారు చేసి కేటగిరి-2 స్థాయి వారికి అప్పగిస్తారు.
కేటగిరి-2 స్థాయి స్మగ్లర్లు స్థానికంగా పట్టు కలిగి కేటగిరి- 3 స్థాయి వారికి పంపిస్తారు. 3వ స్థాయిలో టన్ను 5 నుంచి 15 లక్షల వరకు ధర పలుకుతుంది. కేటగిరి-3 స్థాయి వారు నగరంలోని బడా స్మగ్లర్ల స్థాయి వరకు చేరవేస్తారు. డంప్‌లు ఏర్పాటు చేసుకుంటారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరులలో ఉండే బడా స్మగ్లర్లకు కేటగిరి-3 స్థాయి వారు తమ డంప్‌ల నుంచి రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా వివిధ రకాల పద్ధతుల్లో అక్రమంగా రవాణాచేస్తారు. బెంగళూరు, కటికనహళ్లిలలో 30 నుంచి 60 టన్నుల దాకా ఒక్కో డంప్‌లో ఎర్రచందనం దుంగలను నిల్వ చేస్తారని విశ్వసనీయ సమాచారం.
ఒరిస్సా, అస్సాంల మీదుగా కోల్‌కత్తాకు జాతీయ రహదారుల్లో నాపరాళ్ల మాటున ఎర్రబంగారాన్ని తరలిస్తారు. చెన్నై, అస్సాం, ఒరిస్సా, కోల్‌కత్తాల మీదుగా చైనా, నేపాల్, థాయ్‌లాండ్, సౌదీ అరేబియా, యూరప్ దేశాలన్నింటికీ ఎర్రచందనం దుంగలను పంపిస్తున్నారు. ఇటీవల కాలంలో కృష్ణపట్నంమీదుగా పంపిస్తున్నారని సమాచారం. ఓడరేపు ద్వారా విదేశాలకు ఎంచక్కా ఎగుమతి చేస్తున్నారు. విదేశాలకు చేరుకునేసరికి ఒక్కో టన్నుకు 30 నుంచి 60 లక్షలను వసూలు చేస్తున్నారు. 2002-03 నుంచి 2011-12 సంవత్సరాల వరకు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్లలో నమోదైన కేసులు, వాటి వివరాలిలా ఉన్నాయి.
‘ఎర్ర’ దోపిడీ
Published Wed, Dec 11 2013 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement