విజయనగరం జిల్లా రామభద్రాపురానికి చెందిన ఈ దంపతులు యశోద, బంగారినాయుడు. నిత్యం మద్యం తాగే బంగారినాయుడు ఇప్పుడు గ్రామంలో మునిపటిలా మద్యం దొరకపోవడంతో తాగుడుకు దూరమయ్యాడు. ‘ఇప్పుడు మా సంసారం బాగుందయ్యా. దశల వారీ మద్య నిషేధం మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది’ అని యశోద ఆనందంగా చెబుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్ శనగల్ని వంటకు సిద్ధం చేస్తున్న యశోద, బంగారి నాయుడు దంపతులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: దశలవారీ మద్య నిషేధం పుణ్యమా అని వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి మనశ్శాంతిగా బతుకుతున్నాయి. విజయనగరం జిల్లాలో గతంలో 6 వేల వరకు బెల్టు షాపులు ఉండేవి. ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో అవన్నీ మూతపడ్డాయి. గతంలో జిల్లాలో 210 మద్యం దుకాణాలు ఉంటే.. గత అక్టోబర్ 1న తొలి విడతగా 20 శాతం తగ్గించి మొత్తం దుకాణాలను 168కి పరిమితం చేశారు. తొలుత 10 శాతం ధరలు పెంచారు. దీంతో అమ్మకాలు తగ్గాయి. లాక్‌డౌన్ అనంతరం మద్యం షాపులు పునఃప్రారంభం కాగా.. ఆ వెంటనే మరో 13 శాతం షాపులను తగ్గించింది. ధరలను సైతం ఒకేసారి 75 శాతం పెంచడంతో మద్యం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది జూన్ 15 వరకు 13,53,167 కేసుల మద్యం, 4,76,665 కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా.. ప్రభుత్వం చర్యలతో ఈ ఏడాది జూన్ 15 వరకు 8,31,428 కేసుల మద్యం, 3,97,974 కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
సంతోషంగా బతుకుతున్నాం
–బలగ పార్వతి, చినభీమవరం, బాడంగి మండలం
మాది పేద వ్యవసాయ కుటుంబం. గతంలో ఊరంతా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మందు అమ్మేవారు. నా భర్త తిరుపతి అక్కడికెళ్లి తాగేవాడు.
ఏ రోజూ ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ఆరోగ్యాన్ని అసలు లెక్క చేసేవాడు కాదు. తరచూ ఇంట్లో గొడవలు, పస్తులు సర్వసాధారణంగా ఉండేవి. ఇప్పుడు మద్యం దుకాణాలు తగ్గిపోవడం, ధరలు పెరగడంతో చిరాకొచ్చి మందు మానేశాడు. పిల్లలతోను, నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. సంతోషంగా బతుకుతున్నాం.
తాగుడు మానేశాడయ్యా!
– వేచలం లక్ష్మి, ఉత్తరాపల్లి, కొత్తవలస మండలం
నా పెనిమిటి ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తాడయ్యా. ఆయన మద్యానికి బానిస కావటంతో కుటుంబమంతా దుర్భర జీవితం గడిపేవాళ్లం. వచ్చిన కొద్దిపాటి సంపాదన తాగుడికే తగలేయడంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బెల్టు షాపులు తీసేయడంతో ఊళ్లో మద్యం దొరకట్లేదు. రేట్లు కూడా పెరగడంతో అంత పెట్టి కొనలేక నా పెనిమిటి తాగుడు మానేశాడయ్యా. ఇప్పుడు జీతమంతా ఇంటికే తెచ్చిస్తన్నాడు. రోజూ పిల్లలతో కలిసి అంతా ఒకేసారి భోంచేస్తంటే శానా ఆనందంగా ఉందయ్యా.
Comments
Please login to add a commentAdd a comment