యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: కంది పంట విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ఖర్చులు పెరగడం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఈ పంటను పండించేందుకు రైతులు అంతగా సుముఖత చూపడంలేదు. గతంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న మెట్ట పొలాలు కందితో కళకళలాడుతుండేవి. ప్రస్తుతం కంది పంట ఎక్కువగా కనిపించడంలేదు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిలతో పాటు పండ్ల తోటలు పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కంది పంటకు ఎకరాకు దాదాపు రూ 10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ పంట వేసిన నాటి నుంచి వర్షం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.
చీడపీడల నుంచి కాపాడుకునేందుకు పురుగు మందులు కొట్టాలి. అడవి పందుల బెడద నుంచి కాపాడుకోవాలి. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం వాటి ల్లుతోంది. ఇంత కష్టపడినా ఎకరాకు రూ 20 వేలకు మించి ఆదాయం రావడం లేదు. ఖర్చులు పోను రైతులకు మిగిలేది రూ 10 వేలు మాత్రమే. కంది విరగపండినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పత్తి, మిర్చి పంటలు, పండ్ల తోటల పరిస్థితి కంది పంట పండించినట్లు ఉండదు. పెట్టుబడులు పెట్టిన కొద్దీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో కంది 1,50,338 ఎకరాల్లో పండించాల్సి ఉండగా లక్ష ఎకరాల్లో పంట విత్తుకున్నట్లు అధికారిక సమాచారం. అంటే 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట తగ్గింది.
వచ్చే ఖరీఫ్‌లో ఈ విస్తీర్ణం మరింతగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. వాణిజ్య పంటలైన పత్తి 1,18,756 ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను దాదాపు 2 లక్షల ఎకరాలు, మిరప 1,22,300 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, 2 లక్షల 680 ఎకరాల్లో పంటలు పండించారు. వీటికి తగినట్లే పండ్ల తోటల విస్తీర్ణం పెరిగింది. బొప్పాయి 2వేల ఎకరాలకు గాను 5 వేల ఎకరాలకు పెరిగింది. బత్తాయి, అరటి తోటల విస్తీర్ణం కూడా పెరిగాయని ఆ శాఖాధికారులు తెలిపారు.
పత్తి పంటను ఖరీఫ్ ప్రారంభంలో విత్తుకున్న రైతులకు కనక వర్షం కురిపించింది. క్వింటా దాదాపు రూ 7వేల వరకు పలికింది. ప్రస్తుతం అంత ధర లేకున్నా రైతు పెట్టిన పెట్టుబడులకు రెండింతల ఆదాయం వచ్చింది. పత్తి పంటకు ఎకరాకు దాదాపు రూ 20 వేల వరకు ఖర్చవుతుంది. 15 నుంచి 20 కోతల వరకు పత్తి వస్తుంది. మొదటి, రెండు కోతల్లోనే పెట్టిన పెట్టుబడులు పోను రైతుకు ఆదాయం లభిస్తుంది. మిరప పంటకు పెట్టుబడులు పెట్టే కొద్దీ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇటువంటి పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.
సంప్రదాయ పంటల విస్తీర్ణం తగ్గుతోంది : శ్రీనివాసరావునాయక్, వ్యవసాయాధికారి
రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటలైన కంది, సజ్జ, ఆముదం విస్తీర్ణం తగ్గిపోయింది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ పంటల విస్తీర్ణం మరింతగా తగ్గవచ్చు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు చెరువులు నిండి, అలుగులు పారాయి. భూగర్భ జలాలు పెరగడం వలన బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. ఈ కారణంతో వాణిజ్య పంటల విస్తీర్ణం మరింతగా పెరగొచ్చు.
‘కంది’పోయింది
Published Mon, Jan 6 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement