red gram crop
-
రైతువేనా అని అడుగుతుండ్రు.
నాపేరు ఏలేటి లక్ష్మారెడ్డి. ఊరు సారంగాపూర్. ఉన్నభూమిలో కొద్దిపాటి కందిపంట వేశా. పంట పండినాక క్వింటాల్ కందులను అమ్మేందుకు మంగళవారం జగిత్యాల మార్కెట్‌కు తీసుకొచ్చిన. ఇక్కడి అధికారులను కలిస్తే.. వ్యవసాయశాఖ నివేదికలో నీ పేరు లేదు. నీ కందులు కొనుగోలు చేయమని చెప్పిండ్రు. నేను రైతును అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు ఆర్డీవో వచ్చి నిజంగా రైతుఅని ఆధారాలు చూపితే కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. ఇవేం నిబంధనలో అర్థం కావడం లేదు. సాక్షి, జగిత్యాల : ఆరుగాలం కష్టపడి కంది పంట పండించిన రైతుకు రంధి తప్పడం లేదు. లేనిపోని నిబంధనలు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం రైతులపాలిట శాపంగా మారింది. జగిత్యాల జిల్లాలోని రెండు మార్కెట్‌యార్డుల్లో కొందిపంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు ఐదురోజులు కావస్తున్నా.. నిబంధనల సాకుతో కొనుగోళ్లకు అధికారులు తిరకాసు పెడుతున్నారు. పంట తీసుకొచి్చన రైతులు యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు. దీంతో రైతు ఐక్యవేదిక నాయకులు సోమవారం మార్కెట్‌యార్డులో అందోళనకు దిగారు. ఎకరానికి రెండున్నర క్వింటాళ్లే రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు ఈ సారి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఎకరంలో ఎంత పంట పండినప్పటికీ కేవలం రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీనికి తోడు వ్యవసాయాధికారుల నివేదికలో కంది పంట పండించిన రైతుల పేర్లు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. తమపేర్లు లేకుంటే కందులను ఎలా అమ్ముకునేదని రైతులు మదనపడుతున్నారు. కందులకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800ఉండటం, ఓపెన్ మార్కెట్లో రూ.3– 4వేలు ఉండటంతో, ఈ ని‘బంధనాల’ బాధలు ఎందుకని చాలామంది రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి దాపురించింది. మార్కెట్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమావేశం జగిత్యాల ఆర్డీవో నరేందర్ మంగళవారం జగిత్యాల మార్కెట్‌యార్డును సందర్శించారు. రైతులనుంచి కందుల కొనుగోళ్లకు లేనిపోని నిబంధనలేంటని అధికారులను ప్రశ్నించారు. రైతులు, మార్కెట్, మార్క్‌ఫెడ్, వ్యవసాయాధికారులతో సమావేశం అయ్యారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ నివేదికలో రైతుల సమాచారం లేనప్పటికి, ఆ మండల తహసీల్దార్‌కు ఫోన్ చేసి, నిజంగా రైతుకంది పంట పండించారని, అతనికి భూమి ఉందని చెప్పితే, ఆ రైతుల కందులు కొనాలని సూచించారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు మాత్రం ఎకరాకు 2.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. లక్ష్యం చేరేనా..? జిల్లాలో ఈ యేడు 3,420 ఎకరాల్లో రైతులు కందిపంట సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. 25వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఐదురోజుల క్రితం జగిత్యాల, కోరుట్లలోని మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800గా నిర్ణయించారు. మార్క్‌ఫెడ్ ద్వారా 5వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్ణయించగా.. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మార్కెట్‌కు వచ్చిన కందుల కుప్పలు -
కందులు కొనేదేవరు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పండించిన పంటలను కొనే దిక్కు లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో రైతుల వద్ద కందులు కొనాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ అర్ధంతరంగా చేతులెత్తిసింది. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన పంటకు కూడా నాణ్యత ప్రమాణాల పేరిట ఇబ్బందులకు గురి చేసిన మార్క్‌ఫెడ్ ఇక నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కందులను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ఎంతకో కొంతకు ప్రైవేటులో అమ్ముకొని నష్టపోతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం లక్షా 90 వేల ఎకరాలు కాగా..ఇందులో దాదాపు 30 వేల ఎకరాల వరకు కంది సాగు చేశారు. దాదాపు లక్షా 88 వేల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, బేల, తాంసి, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ కేంద్రాల్లో నాఫెడ్ ద్వారా కందులను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జనవరి 22న కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,675 చెల్లించారు. కానీ కనీసం నెల రోజులు కూడా కందులు కొనుగోలు చేయకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61,457.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే గతేడాది మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా 3,81,729 క్వింటాళ్ల కందులు కొన్నారు. నాఫెడ్ ద్వారా 15,681 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 2,14,399 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడి వస్తుందన్న అంచనా వేసిన పంటలో ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా కంది పంటను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అర్ధంతరంగా కొనుగోళ్లు నిలిపివేత జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారులు నాఫెడ్ ద్వారా 9 మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోళ్లను జనవరి 22 తర్వాత ప్రారంభించారు. సెలవు దినాలు వదిలేస్తే కనీసం 15 రోజులు కూడా కొనుగోలు చేయలేదు. హైదరాబాద్ మార్క్‌ఫెడ్ అధికారుల ఆదేశాల మేరకు 58 వేల క్వింటాళ్ల టార్గెట్ కాగా అదనంగా రెండు వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతుల వద్ద దాదాపు 80 వేల క్వింటాళ్లకు పైగా కందులు ఇంకా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జైనథ్, బేల మార్కెడ్ యార్డులలో కొనుగోళ్లు నిలిపివేయడంలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించని వైనం.. కంది పంటను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్యాలయం చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటను కోసిన కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అవస్థలకు గురవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 61,150 క్వింటాళ్లకుగాను 34,70,68,812 డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా అధికారులు డబ్బులు మాత్రం అకౌంట్లో జమ చేయకపోవడంతో రైతులు బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల్లో జమచేస్తాం కొనుగోలు చేసిన కందులకు సంబంధించి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తాం. 61 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా నాఫెడ్ నుంచి రూ.17 కోట్లు వచ్చాయి. మిగతా డబ్బులు వచ్చిన వెంటనే జమ చేస్తాం. నాఫెడ్ ద్వారా 58 వేల క్వింటాళ్లను కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వగా 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం. – పుల్లయ్య, మార్క్‌ఫెడ్, మేనేజర్ ఆదిలాబాద్ -
కంది కొనల కత్తిరింపు యంత్రం
మెదక్ రూరల్: మెదక్ వ్యవసాయ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ యంత్రం వచ్చింది. దీన్ని వ్యవసాయ అధికారులు బుధవారం జెడ్పీటిసీ లావణ్యరెడ్డి పొలంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏడీఏ మనోహర మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక యంత్రాలు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్త పరికరాలను అందుబాటులోకి తెస్తోందన్నారు. అందులో భాగంగానే తమ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ మిషన్ (కందిపంటలో కొనలను కత్తిరించే యంత్రం) వచ్చిందన్నారు. ఒకరోజు పదిమంది కూలీలు చేసే పనిని ఈ యంత్రం ద్వారా ఒకరే ఒకరోజులో చేయవచ్చన్నారు. కంది పంటలో కొనలను కత్తించడం వల్ల చెట్లు ఏపుగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చన్నారు. ఈ యంత్రం వినియోగం వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరత ఇబ్బంది ఉండదన్నారు. త్వరలోనే వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రెబల్సన్, ఆత్మ ఏపీఎం శ్రీకాంత్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గట్లపై విత్తు.. ‘శత్రు’ చిత్తు
చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చు. రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయి. ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వరికి తీవ్ర నష్టం కలిగించే అగ్గితెగులు, పొడతెగులు, ఆకుముడత ఎండు తెగుళ్లకు కారణమైన సిద్ద బీజాలు (వ్యాధి కారకాలు) ఒక చోట నుంచి మరోచోటకు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా కంది నిరోధిస్తుంది. చేలగట్ల వెంట కంది నాటడం వల్ల ప్రధాన పంటకు అవసరమైన నీరు, ఎరువుల విషయంలో ఎటువంటి నష్టం ఉండదు. గాలి వానలకు ప్రధాన పంటను కాపాడే కవచంలా కంది మొక్కలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పొలం గట్లపై మొలిచే గడ్ది ద్వారా పంటకు నష్టం కల్గించే కీటకాల నివారణకు కూడా కింది మొక్కలు పనికొస్తాయి. దీంతో పాటు గట్లను పటిష్టంగా ఉంచి ఎలుకలు కన్నాలు పెట్టకుండా వీటి వే రు వ్యవస్థ నివారిస్తుంది. కంది పంట పక్షి స్థావరాలకు ఆవాసంగా ఉండటం వల్ల పంటను పాడు చేసే క్రిములను పక్షులు తినేస్తాయి. దీని వల్ల పంటకు రక్షణ కలుగుతుంది. ఎకరం వరి చేలోని గట్లపై విత్తడానికి 100గ్రాముల కంది విత్తనం సరిపోతుంది. దీనిపై సుమారు 10 నుంచి 15కేజీల వరకు కంది దిగుబడి వస్తుంది. ఇది రైతు కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అమ్ముకుంటే మార్కెట్ ధరను బట్టి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం భూచేతన పథకంలో భాగంగా ఎంపికి చేసిన గ్రామాల్లో ఎకరానికి 100 గ్రాముల చొప్పున కంది విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. 40 శాతం యూరియా ఆదా.. వరి చేలగట్ల వెంబడి కందిని సాగు చేయడం వల్ల 32నుంచి 40శాతం వరకు నత్రజని ఎరువును ఆదాచేయవచ్చు. కందిని ఏక పంటగా వేయడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. భూమిలో కంది వేరు బుడిపెలపై ‘రైజోబియం’అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టిరియా గాలి నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందిస్తుంది. దీనివల్ల భూమిలో న త్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా భూ భౌతిక రసాయన స్థితిగతులు మెరుగుపడతాయి. తద్వారా నత్రజని (యూరియా) వినియోగం తగ్గించుకోవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే 88866 13853 సంప్రదించవచ్చు. అంతర పంటతోనూ లాభాలు.. కందిని తోటలు, ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం పొందవ చ్చు. 1:7 నిష్పత్తిలో కంది, వేరుశెనగ, పెసర, మినుము, సోయా, సాగు చేయవచ్చు.1:2 నిష్పత్తిలో కంది మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేయవచ్చు. ఈ విధంగా అంతరపంటగా కంది వేస్తే భూసారం పెరుగుతుంది. -
రెక్కల కష్టం బూడిద..
పూడూరు, న్యూస్‌లైన్: ఆరుగాలం పడ్డకష్టం బూడిదపాలవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పూడూరులో గురువారం సాయంత్రం 35 ఎకరాల్లో కందిపంట కాలిపోయింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పూడూరు శివారులో 35 ఎకరాల కందిపంట కోతకు చేరుకుంది. ప్రమాదవశాత్తు పంటకు గురువారం సాయంత్రం నిప్పంటుకుంది. రైతులు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. రైతు షాబాద్ వెంకన్నకు చెందిన 2 ఎకరాల పంట, షాబాద్ బందెయ్యకు చెందిన 4 ఎకరాలు, సుల్తాన్పూర్ ఆనందం(5 ఎకరాలు), ఆలూరి అంతయ్య(4 ఎకరాలు), కావలి రాములు(3 ఎకరాలు), కావలి నాగరాజు (4 ఎకరాలు)తో పాటు మొత్తం 35 ఎకరాల పంట కాలిబూడిదైంది. మొదట పరిగి నుంచి, అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేశాయి. లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని ైరె తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
‘కంది’పోయింది
యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: కంది పంట విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ఖర్చులు పెరగడం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఈ పంటను పండించేందుకు రైతులు అంతగా సుముఖత చూపడంలేదు. గతంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న మెట్ట పొలాలు కందితో కళకళలాడుతుండేవి. ప్రస్తుతం కంది పంట ఎక్కువగా కనిపించడంలేదు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిలతో పాటు పండ్ల తోటలు పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కంది పంటకు ఎకరాకు దాదాపు రూ 10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ పంట వేసిన నాటి నుంచి వర్షం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. చీడపీడల నుంచి కాపాడుకునేందుకు పురుగు మందులు కొట్టాలి. అడవి పందుల బెడద నుంచి కాపాడుకోవాలి. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం వాటి ల్లుతోంది. ఇంత కష్టపడినా ఎకరాకు రూ 20 వేలకు మించి ఆదాయం రావడం లేదు. ఖర్చులు పోను రైతులకు మిగిలేది రూ 10 వేలు మాత్రమే. కంది విరగపండినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పత్తి, మిర్చి పంటలు, పండ్ల తోటల పరిస్థితి కంది పంట పండించినట్లు ఉండదు. పెట్టుబడులు పెట్టిన కొద్దీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది 1,50,338 ఎకరాల్లో పండించాల్సి ఉండగా లక్ష ఎకరాల్లో పంట విత్తుకున్నట్లు అధికారిక సమాచారం. అంటే 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట తగ్గింది. వచ్చే ఖరీఫ్‌లో ఈ విస్తీర్ణం మరింతగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. వాణిజ్య పంటలైన పత్తి 1,18,756 ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను దాదాపు 2 లక్షల ఎకరాలు, మిరప 1,22,300 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, 2 లక్షల 680 ఎకరాల్లో పంటలు పండించారు. వీటికి తగినట్లే పండ్ల తోటల విస్తీర్ణం పెరిగింది. బొప్పాయి 2వేల ఎకరాలకు గాను 5 వేల ఎకరాలకు పెరిగింది. బత్తాయి, అరటి తోటల విస్తీర్ణం కూడా పెరిగాయని ఆ శాఖాధికారులు తెలిపారు. పత్తి పంటను ఖరీఫ్ ప్రారంభంలో విత్తుకున్న రైతులకు కనక వర్షం కురిపించింది. క్వింటా దాదాపు రూ 7వేల వరకు పలికింది. ప్రస్తుతం అంత ధర లేకున్నా రైతు పెట్టిన పెట్టుబడులకు రెండింతల ఆదాయం వచ్చింది. పత్తి పంటకు ఎకరాకు దాదాపు రూ 20 వేల వరకు ఖర్చవుతుంది. 15 నుంచి 20 కోతల వరకు పత్తి వస్తుంది. మొదటి, రెండు కోతల్లోనే పెట్టిన పెట్టుబడులు పోను రైతుకు ఆదాయం లభిస్తుంది. మిరప పంటకు పెట్టుబడులు పెట్టే కొద్దీ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇటువంటి పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటల విస్తీర్ణం తగ్గుతోంది : శ్రీనివాసరావునాయక్, వ్యవసాయాధికారి రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటలైన కంది, సజ్జ, ఆముదం విస్తీర్ణం తగ్గిపోయింది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ పంటల విస్తీర్ణం మరింతగా తగ్గవచ్చు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు చెరువులు నిండి, అలుగులు పారాయి. భూగర్భ జలాలు పెరగడం వలన బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. ఈ కారణంతో వాణిజ్య పంటల విస్తీర్ణం మరింతగా పెరగొచ్చు.