ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కందులతో నిరీక్షిస్తున్న రైతులు (ఫైల్)
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పండించిన పంటలను కొనే దిక్కు లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో రైతుల వద్ద కందులు కొనాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ అర్ధంతరంగా చేతులెత్తిసింది. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన పంటకు కూడా నాణ్యత ప్రమాణాల పేరిట ఇబ్బందులకు గురి చేసిన మార్క్‌ఫెడ్ ఇక నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కందులను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ఎంతకో కొంతకు ప్రైవేటులో అమ్ముకొని నష్టపోతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం లక్షా 90 వేల ఎకరాలు కాగా..ఇందులో దాదాపు 30 వేల ఎకరాల వరకు కంది సాగు చేశారు. దాదాపు లక్షా 88 వేల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, బేల, తాంసి, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ కేంద్రాల్లో నాఫెడ్ ద్వారా కందులను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జనవరి 22న కొనుగోళ్లు ప్రారంభించారు.
క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,675 చెల్లించారు. కానీ కనీసం నెల రోజులు కూడా కందులు కొనుగోలు చేయకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61,457.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే గతేడాది మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా 3,81,729 క్వింటాళ్ల కందులు కొన్నారు. నాఫెడ్ ద్వారా 15,681 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 2,14,399 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడి వస్తుందన్న అంచనా వేసిన పంటలో ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా కంది పంటను కొనుగోలు చేయకపోవడం గమనార్హం.
అర్ధంతరంగా కొనుగోళ్లు నిలిపివేత
జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారులు నాఫెడ్ ద్వారా 9 మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోళ్లను జనవరి 22 తర్వాత ప్రారంభించారు. సెలవు దినాలు వదిలేస్తే కనీసం 15 రోజులు కూడా కొనుగోలు చేయలేదు. హైదరాబాద్ మార్క్‌ఫెడ్ అధికారుల ఆదేశాల మేరకు 58 వేల క్వింటాళ్ల టార్గెట్ కాగా అదనంగా రెండు వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతుల వద్ద దాదాపు 80 వేల క్వింటాళ్లకు పైగా కందులు ఇంకా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జైనథ్, బేల మార్కెడ్ యార్డులలో కొనుగోళ్లు నిలిపివేయడంలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
డబ్బులు చెల్లించని వైనం..
కంది పంటను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్యాలయం చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటను కోసిన కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అవస్థలకు గురవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 61,150 క్వింటాళ్లకుగాను 34,70,68,812 డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా అధికారులు డబ్బులు మాత్రం అకౌంట్‌లో జమ చేయకపోవడంతో రైతులు బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు.
రెండు రోజుల్లో జమచేస్తాం
కొనుగోలు చేసిన కందులకు సంబంధించి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తాం. 61 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా నాఫెడ్ నుంచి రూ.17 కోట్లు వచ్చాయి. మిగతా డబ్బులు వచ్చిన వెంటనే జమ చేస్తాం. నాఫెడ్ ద్వారా 58 వేల క్వింటాళ్లను కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వగా 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం. – పుల్లయ్య, మార్క్‌ఫెడ్, మేనేజర్ ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment