రైతువేనా అని అడుగుతుండ్రు. | Red Gram Farmers worried About Their Crops Cost Price | Sakshi
Sakshi News home page

కందుల కొనుగోళ్లకు కొర్రీలు

Published Wed, Feb 26 2020 8:58 AM | Last Updated on Wed, Feb 26 2020 9:11 AM

Red Gram Farmers worried About Their Crops Cost Price - Sakshi

మార్కెట్‌యార్డులో అధికారులు, రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో నరేందర్‌

నాపేరు ఏలేటి లక్ష్మారెడ్డి. ఊరు సారంగాపూర్‌. ఉన్నభూమిలో కొద్దిపాటి కందిపంట వేశా. పంట పండినాక క్వింటాల్‌ కందులను అమ్మేందుకు మంగళవారం జగిత్యాల మార్కెట్‌కు తీసుకొచ్చిన. ఇక్కడి అధికారులను కలిస్తే.. వ్యవసాయశాఖ నివేదికలో నీ పేరు లేదు. నీ కందులు కొనుగోలు చేయమని చెప్పిండ్రు. నేను రైతును అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు ఆర్డీవో వచ్చి నిజంగా రైతుఅని ఆధారాలు చూపితే కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. ఇవేం నిబంధనలో అర్థం కావడం లేదు.


సాక్షి, జగిత్యాల : ఆరుగాలం కష్టపడి కంది పంట పండించిన రైతుకు రంధి తప్పడం లేదు. లేనిపోని నిబంధనలు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం రైతులపాలిట శాపంగా మారింది. జగిత్యాల జిల్లాలోని రెండు మార్కెట్‌యార్డుల్లో కొందిపంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు ఐదురోజులు కావస్తున్నా.. నిబంధనల సాకుతో కొనుగోళ్లకు అధికారులు తిరకాసు పెడుతున్నారు. పంట తీసుకొచి్చన రైతులు యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు. దీంతో రైతు ఐక్యవేదిక నాయకులు సోమవారం మార్కెట్‌యార్డులో అందోళనకు దిగారు.

ఎకరానికి రెండున్నర క్వింటాళ్లే
రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు ఈ సారి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఎకరంలో ఎంత పంట పండినప్పటికీ కేవలం రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీనికి తోడు వ్యవసాయాధికారుల నివేదికలో కంది పంట పండించిన రైతుల పేర్లు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. తమపేర్లు లేకుంటే కందులను ఎలా అమ్ముకునేదని రైతులు మదనపడుతున్నారు. కందులకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800ఉండటం, ఓపెన్‌ మార్కెట్లో రూ.3– 4వేలు ఉండటంతో, ఈ ని‘బంధనాల’ బాధలు ఎందుకని చాలామంది రైతులు ఓపెన్‌ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి దాపురించింది.

మార్కెట్, మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమావేశం
జగిత్యాల ఆర్డీవో నరేందర్‌ మంగళవారం జగిత్యాల మార్కెట్‌యార్డును సందర్శించారు. రైతులనుంచి కందుల కొనుగోళ్లకు లేనిపోని నిబంధనలేంటని అధికారులను ప్రశ్నించారు. రైతులు, మార్కెట్, మార్క్‌ఫెడ్, వ్యవసాయాధికారులతో సమావేశం అయ్యారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ నివేదికలో రైతుల సమాచారం లేనప్పటికి, ఆ మండల తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి, నిజంగా రైతుకంది పంట పండించారని, అతనికి భూమి ఉందని చెప్పితే, ఆ రైతుల కందులు కొనాలని సూచించారు. అయితే మార్క్‌ఫెడ్‌ అధికారులు మాత్రం ఎకరాకు 2.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.

లక్ష్యం చేరేనా..? 
జిల్లాలో ఈ యేడు 3,420 ఎకరాల్లో రైతులు కందిపంట సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. 25వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఐదురోజుల క్రితం జగిత్యాల, కోరుట్లలోని మార్కెట్‌ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800గా నిర్ణయించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా 5వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్ణయించగా.. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు.

మార్కెట్‌కు వచ్చిన కందుల కుప్పలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement