పరికరాన్ని పరిశీలిస్తున్న జెడ్పీటీసీ లావణ్యరెడ్డి
మెదక్ రూరల్: మెదక్ వ్యవసాయ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ యంత్రం వచ్చింది. దీన్ని వ్యవసాయ అధికారులు బుధవారం జెడ్పీటిసీ లావణ్యరెడ్డి పొలంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏడీఏ మనోహర మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక యంత్రాలు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్త పరికరాలను అందుబాటులోకి తెస్తోందన్నారు. అందులో భాగంగానే తమ కార్యాలయానికి రెడ్‌గ్రామ్ నిప్పింగ్ మిషన్ (కందిపంటలో కొనలను కత్తిరించే యంత్రం) వచ్చిందన్నారు.
ఒకరోజు పదిమంది కూలీలు చేసే పనిని ఈ యంత్రం ద్వారా ఒకరే ఒకరోజులో చేయవచ్చన్నారు. కంది పంటలో కొనలను కత్తించడం వల్ల చెట్లు ఏపుగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చన్నారు. ఈ యంత్రం వినియోగం వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరత ఇబ్బంది ఉండదన్నారు. త్వరలోనే వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రెబల్‌సన్, ఆత్మ ఏపీఎం శ్రీకాంత్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.