వేట ముమ్మరం
=విదేశాల్లోని స్మగ్లర్లను రప్పించేందుకు వ్యూహం
=ఇంటర్‌పోల్ సహకారంతో రెడ్‌కార్నర్ నోటీసులు
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లను సమూలం గా ఏరి వేసేందుకు వేట ముమ్మరమైంది. ఇంటర్‌పోల్ సహకారంతో పోలీసులు ముందుకు వెళ్లనున్నారు. ఇక స్మగ్లర్ల వేట కు డాగ్ స్క్వాడ్లు సైతం రంగంలోకి దిగనున్నాయి. అటవీశాఖ అధికారుల హత్య తో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషించారు. అటవీశాఖకు పరిమితులు ఉన్న నేపథ్యంలో ఈ బాధ్యతను పోలీస్‌శాఖ పూర్తిగా తీసుకుంది.
అక్రమార్కులు దేశంలోని సముద్ర, రోడ్డు మార్గాల మీదుగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని దుబాయ్, సింగపూర్, మలేషియా మీదుగా హాం కాంగ్, చైనా, జపాన్‌లకు తరలిస్తున్నారు. బెంగళూరు రూరల్ కటికనహళ్లి, చెన్నై శివార్లలోని రెడ్‌హిల్స్‌కు చెందిన కొందరు స్మగ్లర్లు దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిని కటకటాల వెనక్కి నెట్టే దిశగా పోలీసు ఉన్నతాధికారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం అంతు తేల్చేందుకు చిత్తూరు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాల ఎస్పీలు రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్, డీఐజీ బాలకృష్ణల నేతృత్వంలో ప్రత్యేక వ్యూహరచన చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాకు మూలస్తంభాలుగా ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్ల భరతం పట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకు కేంద్ర హోంశాఖ, సెంట్రల్ కస్టమ్స్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాల సహకారం తీసుకోనున్నారు.
ఇక రెడ్‌కార్నర్ నోటీసులు
విదేశాల్లో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తున్న వారిభరతం పట్టేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ సహకారంతో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న సాహు అహ్మద్‌ను మన దేశానికి రప్పించి అరెస్టు చేసేందుకు తొలిసారి రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసేందుకు తిరుపతి అర్బన్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే కోవలో చిత్తూరు పోలీసులు కటికనహళ్లికి చెంది దుబాయ్‌లో ఉంటూ స్మగ్లింగ్ చేస్తున్న వారిని రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రెండు జిల్లాల పోలీసుబాస్‌ల వ్యూహం ఫలిస్తే విదేశాల్లోని చాలా మంది ఎర్రచందనం స్మగ్లర్లు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు.
స్మగ్లర్ల అనుయాయులపై నిఘా
దుబాయ్, సింగపూర్‌ల్లో తలదాచుకుంటున్న ఎర్రచందనం స్మగ్లర్ల వీసా, పాస్‌పోర్టుల్లోని వివరాలను సేకరించే పనిలో పోలీసుశాఖ నిమగ్నమైంది. ఈ క్రమంలోనే జిల్లాలో వారి అనుయాయులపై నిఘా పెట్టింది. వీరు స్మగ్లర్లతో ఎలా సంబంధాలు కొనసాగిస్తున్నారు, స్మగ్లర్ల బంధువుల పాత్ర తదితర అంశాలపై టాస్క్ ఫోర్‌స దృష్టి పెట్టింది. ఇందుకు తమిళనాడు, కర్ణాటక పోలీసుల సహకారం తీసుకోనుంది.
ఎర్రదొంగల వేటకు డాగ్‌స్క్వాడ్లు
ఇప్పటి వరకు బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు, మద్యం, డ్రగ్స్ వంటి వాటిని పసిగట్టేందుకే డాగ్‌స్క్వాడ్‌లు పనిచేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎర్రదొంగలను పట్టుకోవడం, వాహనాల తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్లను ఉపయోగించడంపై పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీలైనంత త్వరలో తిరుపతి అర్బన్ , చిత్తూరు పోలీసు జిల్లాల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాను పసిగట్టేందుకు డాగ్‌స్క్వాడ్లు రంగంలోకి దిగనున్నాయి.