hunting smugglers
-
దొంగలు దోచేస్తున్నారు..పోలీసులేం చేస్తున్నారు
- జిల్లాలో చెలరేగిపోతున్న దొంగలు - ఓ వైపు ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో పోలీసులు - మరోవైపు దోపిడీ దొంగల స్వైర విహారం కడప అర్బన్: జిల్లాలో రోజురోజుకు దోపిడీ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగల ముఠా తమ కార్యకలాపాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో కొన్ని ముఠాలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజల మాన ప్రాణాలతో సైతం చెలగాటమాడేవారు. ప్రస్తుతం పెడదోవ పట్టిన యువత ముఠాలుగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెక్కీలు నిర్వహించి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. కొన్ని సంఘటనల్లో వృద్ధులు, మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో వారిని బెదిరించి, దాడిచేసి దోచుకెళుతున్నారు. జిల్లాలో పోలీసులేమో ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లను సైతం అరెస్టు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ మరోవైపు వరుసగా జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగలు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వారు భారీ మొత్తంలో దోచుకెళ్లినా పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేసి నామమాత్ర ంగా రికవరీ చేసి జైలుకు పంపారనే విమర్శలున్నాయి. తర్వాత మే చివరి వారంలో, జూన్ నెలలో జిల్లాలో తిరిగి దొంగల ముఠా స్వైర విహారం చేసిందనే చెప్పవచ్చు. ఈ దోపిడీ సంఘటనల వివరాలను పరిశీలిస్తే.. - మ్మలమడుగులోని నాగులకట్ట వీధిలో చౌడం పుల్లమ్మ (70) అనే వృద్ధురాలు తన ఇంటిలో ఉండగా పట్టపగలు గతనెల 27వ తేదీన దోపిడీ దొంగలు ఆమె మెడపై కాళ్లతో తొక్కి కత్తితో గాయపరిచి నాలుగు తులాల చైను, ఐదు తులాల గాజులు దోచుకెళ్లారు. - గతనెల 16వ తేదీ తెల్లవారుజామున ఖాజీపేట మండలం తవ్వారిపల్లె గ్రామంలో ఓబుల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి ఇంటిపైభాగాన నిద్రించాడు. ఆయన ఇంటి వెనుక కన్నం వేసి 19 తులాల బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. - కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ రోడ్డులోని లక్ష్మిటవర్స్లో ఐదవ అంతస్తులో న్యాయవాది హైమావతి ఇంట్లో లేని సమయంలో పట్టపగలు దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 27 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. - కడప-తిరుపతి బస్సులో గతనెల 9వ తేదీన తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన బంగారు నగల బ్యాగును కాజేశారు. - అలాగే కడప తాలూకా పరిధిలోని బాలాజీనగర్‌లోనూ, టుటౌన్ పరిధిలోని సర్ఖాజీపుర వీధిలోనూ, చింతకొమ్మదిన్నె పరిధిలోని ఓ అధ్యాపకుని ఇంటిలోనూ రాత్రి ఇంటి తాళాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. - చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో సుమన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. - గతనెల 21వ తేదీన కడప రైల్వేస్టేషన్లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన కడప నాగరాజుపేటకు చెందిన అఫ్రియాబేగం, నస్రీన్‌భాను అనే మహిళల బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలను కాజేశారు. ఇప్పటికైనా పోలీసుల నిఘా పెంచకపోతే మరిన్ని దోపిడీలు, దొంగతనాలు జరిగే ప్రమాదముంది. -
వేట ముమ్మరం
=విదేశాల్లోని స్మగ్లర్లను రప్పించేందుకు వ్యూహం =ఇంటర్‌పోల్ సహకారంతో రెడ్‌కార్నర్ నోటీసులు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లను సమూలం గా ఏరి వేసేందుకు వేట ముమ్మరమైంది. ఇంటర్‌పోల్ సహకారంతో పోలీసులు ముందుకు వెళ్లనున్నారు. ఇక స్మగ్లర్ల వేట కు డాగ్ స్క్వాడ్లు సైతం రంగంలోకి దిగనున్నాయి. అటవీశాఖ అధికారుల హత్య తో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలనూ అన్వేషించారు. అటవీశాఖకు పరిమితులు ఉన్న నేపథ్యంలో ఈ బాధ్యతను పోలీస్‌శాఖ పూర్తిగా తీసుకుంది. అక్రమార్కులు దేశంలోని సముద్ర, రోడ్డు మార్గాల మీదుగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని దుబాయ్, సింగపూర్, మలేషియా మీదుగా హాం కాంగ్, చైనా, జపాన్‌లకు తరలిస్తున్నారు. బెంగళూరు రూరల్ కటికనహళ్లి, చెన్నై శివార్లలోని రెడ్‌హిల్స్‌కు చెందిన కొందరు స్మగ్లర్లు దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిని కటకటాల వెనక్కి నెట్టే దిశగా పోలీసు ఉన్నతాధికారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం అంతు తేల్చేందుకు చిత్తూరు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాల ఎస్పీలు రాయలసీమ రేంజ్ ఐజీ రాజీవ్త్రన్, డీఐజీ బాలకృష్ణల నేతృత్వంలో ప్రత్యేక వ్యూహరచన చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాకు మూలస్తంభాలుగా ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్ల భరతం పట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందుకు కేంద్ర హోంశాఖ, సెంట్రల్ కస్టమ్స్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాల సహకారం తీసుకోనున్నారు. ఇక రెడ్‌కార్నర్ నోటీసులు విదేశాల్లో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తున్న వారిభరతం పట్టేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ సహకారంతో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న సాహు అహ్మద్‌ను మన దేశానికి రప్పించి అరెస్టు చేసేందుకు తొలిసారి రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసేందుకు తిరుపతి అర్బన్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే కోవలో చిత్తూరు పోలీసులు కటికనహళ్లికి చెంది దుబాయ్‌లో ఉంటూ స్మగ్లింగ్ చేస్తున్న వారిని రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. రెండు జిల్లాల పోలీసుబాస్ల వ్యూహం ఫలిస్తే విదేశాల్లోని చాలా మంది ఎర్రచందనం స్మగ్లర్లు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. స్మగ్లర్ల అనుయాయులపై నిఘా దుబాయ్, సింగపూర్‌ల్లో తలదాచుకుంటున్న ఎర్రచందనం స్మగ్లర్ల వీసా, పాస్‌పోర్టుల్లోని వివరాలను సేకరించే పనిలో పోలీసుశాఖ నిమగ్నమైంది. ఈ క్రమంలోనే జిల్లాలో వారి అనుయాయులపై నిఘా పెట్టింది. వీరు స్మగ్లర్లతో ఎలా సంబంధాలు కొనసాగిస్తున్నారు, స్మగ్లర్ల బంధువుల పాత్ర తదితర అంశాలపై టాస్క్ ఫోర్స దృష్టి పెట్టింది. ఇందుకు తమిళనాడు, కర్ణాటక పోలీసుల సహకారం తీసుకోనుంది. ఎర్రదొంగల వేటకు డాగ్‌స్క్వాడ్‌లు ఇప్పటి వరకు బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు, మద్యం, డ్రగ్స్ వంటి వాటిని పసిగట్టేందుకే డాగ్‌స్క్వాడ్‌లు పనిచేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎర్రదొంగలను పట్టుకోవడం, వాహనాల తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్‌లను ఉపయోగించడంపై పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీలైనంత త్వరలో తిరుపతి అర్బన్ , చిత్తూరు పోలీసు జిల్లాల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాను పసిగట్టేందుకు డాగ్‌స్క్వాడ్‌లు రంగంలోకి దిగనున్నాయి.