దొంగలు దోచేస్తున్నారు..పోలీసులేం చేస్తున్నారు
- జిల్లాలో చెలరేగిపోతున్న దొంగలు
- ఓ వైపు ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో పోలీసులు
- మరోవైపు దోపిడీ దొంగల స్వైర విహారం
కడప అర్బన్: జిల్లాలో రోజురోజుకు దోపిడీ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగల ముఠా తమ కార్యకలాపాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో కొన్ని ముఠాలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజల మాన ప్రాణాలతో సైతం చెలగాటమాడేవారు. ప్రస్తుతం పెడదోవ పట్టిన యువత ముఠాలుగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెక్కీలు నిర్వహించి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు.
కొన్ని సంఘటనల్లో వృద్ధులు, మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో వారిని బెదిరించి, దాడిచేసి దోచుకెళుతున్నారు. జిల్లాలో పోలీసులేమో ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లను సైతం అరెస్టు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ మరోవైపు వరుసగా జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగలు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.
వారు భారీ మొత్తంలో దోచుకెళ్లినా పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేసి నామమాత్ర ంగా రికవరీ చేసి జైలుకు పంపారనే విమర్శలున్నాయి. తర్వాత మే చివరి వారంలో, జూన్ నెలలో జిల్లాలో తిరిగి దొంగల ముఠా స్వైర విహారం చేసిందనే చెప్పవచ్చు. ఈ దోపిడీ సంఘటనల వివరాలను పరిశీలిస్తే..
- మ్మలమడుగులోని నాగులకట్ట వీధిలో చౌడం పుల్లమ్మ (70) అనే వృద్ధురాలు తన ఇంటిలో ఉండగా పట్టపగలు గతనెల 27వ తేదీన దోపిడీ దొంగలు ఆమె మెడపై కాళ్లతో తొక్కి కత్తితో గాయపరిచి నాలుగు తులాల చైను, ఐదు తులాల గాజులు దోచుకెళ్లారు.
- గతనెల 16వ తేదీ తెల్లవారుజామున ఖాజీపేట మండలం తవ్వారిపల్లె గ్రామంలో ఓబుల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి ఇంటిపైభాగాన నిద్రించాడు. ఆయన ఇంటి వెనుక కన్నం వేసి 19 తులాల బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
- కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ రోడ్డులోని లక్ష్మిటవర్స్‌లో ఐదవ అంతస్తులో న్యాయవాది హైమావతి ఇంట్లో లేని సమయంలో పట్టపగలు దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 27 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
- కడప-తిరుపతి బస్సులో గతనెల 9వ తేదీన తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన బంగారు నగల బ్యాగును కాజేశారు.
- అలాగే కడప తాలూకా పరిధిలోని బాలాజీనగర్‌లోనూ, టుటౌన్ పరిధిలోని సర్‌ఖాజీపుర వీధిలోనూ, చింతకొమ్మదిన్నె పరిధిలోని ఓ అధ్యాపకుని ఇంటిలోనూ రాత్రి ఇంటి తాళాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
- చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో సుమన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు.
- గతనెల 21వ తేదీన కడప రైల్వేస్టేషన్‌లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన కడప నాగరాజుపేటకు చెందిన అఫ్రియాబేగం, నస్రీన్‌భాను అనే మహిళల బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలను కాజేశారు. ఇప్పటికైనా పోలీసుల నిఘా పెంచకపోతే మరిన్ని దోపిడీలు, దొంగతనాలు జరిగే ప్రమాదముంది.