చైన్ స్నాచింగ్ ముఠాల గుట్టు రట్టు
చైన్ స్నాచింగ్ ముఠాల గుట్టు రట్టు
Published Tue, Sep 20 2016 9:07 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
* రూ. 16 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
* పోలీసుల అదుపులో ఇద్దరు బాల నిందితులతో సహా ఎనిమిది మంది
గుంటూరు (నగరంపాలెం): గుంటూరు నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాలకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బాల నిందితులున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్ వివరాలు వెల్లడించారు. రెండు ముఠాలుగా ఏర్పడిన ఎనిమిది మంది పట్టాభిపురం, కొత్తపేట, అరండల్‌పేట, నల్లపాడు, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మార్చి 3 వ తేదీ నుంచి సెప్టెంబరు 5 వ తేదీ వరకు మొత్తం 12 చైన్ స్నాచింగ్స్, 6 చైన్ స్నాచింగ్ ప్రయత్నాలు చేశారు. ఐపీడీ కాలనీకి చెందిన పసుపులేటి బాలు, దూదేకుల నాసరవలి ఒక ముఠాగా.., నల్లచెరువుకు చెందిన మహంకాళి దుర్గారావు నాయకుడుగా సంపత్‌నగర్‌కి చెందిన టేకి పవన్‌కుమార్, శ్రీనివాసరావుతోటకు చెందిన కుంచాల అంకమ్మరావు, ఆర్ అగ్రహారానికి చెందిన పసుపులేటి దుర్గా శేఖర్, ఇద్దరు బాలనేరస్తులు ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడ్డారు. చైన్ స్నాచింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశేష్టి త్రిపాఠీ పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేసులను ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ అధారంగా నిందితులను గుర్తించి మంగళవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆరుగురు వ్యక్తుల నుంచి 180 గ్రాముల బంగారం చైన్లు, ఇద్దరు వ్యక్తుల నుంచి 186గ్రాముల బంగారం చైన్లు, దోపిడీకి వినియోగించిన ఒక యాక్టివా, రెండు ఎఫ్‌జడ్ , ఒక సీబీజడ్, ఒక కరిజ్మా, ఒక షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.16లక్షలు ఉంటుంది.
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే..
నిందితులలో 19 నుంచి 20 సంత్సరాల యువకులు ఆరుగురు, ఇద్దరు బాలనేరస్తులు ఉన్నారు. వీరు ఈజీ మనీ సంపాదించటానికే చైన్‌స్నాచింగ్‌లు చేయటం ప్రారంభించారని తిరుపాల్ తెలిపారు. పసుపులేటి బాలు ఆటోడ్రైవరుగా జీవిస్తూ కర్రబిళ్ళలో,గుర్రపు పందెల్లో బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోగొట్టుకొని నాసర్‌వలితో స్నేహం చేస్తూ తేలికగా డబ్బు సంపాదించటానికి ఈ మార్గం ఎంచుకున్నాడన్నారు. మహంకాళి దుర్గారావు ,పేటి పవన్‌కుమార్ 2015లో చైన్‌స్నాచింగ్ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన తర్వాత స్థానిక యువకుల సహకారంతో చైన్ స్నాచింగ్‌లు చేయటం ప్రారంభించారన్నారు. నగర ప్రజలు, తల్లిదండ్రులు పనీపాట లేకుండా అధికంగా నగదు ఖర్చు చేస్తున్న యువతపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఎమ్. సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement