సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రద్దయ్యే ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు టిక్కెట్‌ల రుసుమును తిరిగి చెల్లించనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఈ-టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లు తమ బస్సు సర్వీసు రద్దయితే.. online.support @apsrtc.in కు తమ టిక్కెట్ వివరాలను ఈ మెయిల్ చేయాలి. అలాగే బి2బి(సింగిల్ ఫ్రాంచైజీ) వద్ద టిక్కెట్ కొనుగోలుచేసిన ప్రయాణికులు సదరు బీ2బీ ఏజెంట్ వద్ద మాత్రమే రీఫండ్ తీసుకోవాలి. బస్‌స్టేషన్‌లలో, అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్‌ల వద్ద టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లు తమ ప్రయాణానికి 48 గంటలు ముందు కానీ, 48 గంటలు తరువాత కానీ టిక్కెట్‌లు రద్దు చేసుకోవచ్చు. నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాలు, మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లలోని టిక్కెట్ కౌంటర్‌లలో డబ్బులు తిరిగి తీసుకోవచ్చు.