ఉద్రిక్తతల మధ్య బాధ్యతల స్వీకారం
{పాంతీయ వివాదం సుడిలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలి
చైర్మన్, సభ్యులను అడ్డుకున్న తెలంగాణ నాయకులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలి నియామకం ప్రాంతీయ వివాదానికి దారి తీసింది. బుధవారం మండలి చైర్మన్, సభ్యులు బాధ్యతల స్వీకరణ కోసం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కార్పొరేషన్ కార్యాలయానికి రాగా, వారిని తెలంగాణ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పడంతో కార్పొరేషన్ ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. తదనంతరం కార్యాలయంలో మేనేజింగ్ డెరైక్టర్ ఎస్‌ఏ షుకూర్ చేతుల మీదుగా చైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం బాధ్యతల స్వీకార కార్యక్రమంలోనూ వివాదం చెలరేగడంతో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అనంతరం బుధవారం న్యాయ సలహా తీసుకున్నాక నియామకానికి పచ్చజెండా ఊపారు.
పాలకమండలి ఇదే
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్: మహ్మద్ హిదాయత్ అలీ (గుంటూరు). సభ్యులు: సయ్యద్ హమీద్ హుస్సేన్ జాఫ్రీ (హైదరాబాద్), మహ్మద్ గులాం గౌస్ (మహబూబ్‌నగర్), షేక్ నజీర్ అహ్మద్ (కడప), మహ్మద్ వహీద్ ఖాన్ (సిద్దిపేట్), షేక్ అన్వర్ బాష (గుంటూరు), మహ్మద్ జమీర్ ఖాన్ (చిత్తూరు), రియాజ్ (అనంతపురం), షేక్ ఫజ్‌లే ఇలాహి (రాయచోటి), పఠాన్ ఆశ్వాక్ రహీం ఖాన్ (కర్నూల్), షేక్ ముక్తార్ (విజయవాడ), నాగూర్ మహ్మద్ ముస్తాఫా (చిత్తూరు)లతో పాటు ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌లు సభ్యులుగా ఉన్నారు.