అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్‌.. | Relatives Leave Corona Patient Funeral in Palasa Health Department Transport in JCB | Sakshi
Sakshi News home page

గుండెల్లో గోడలు...

Published Sat, Jun 27 2020 6:52 AM | Last Updated on Sat, Jun 27 2020 11:00 AM

Relatives Leave Corona Patient Funeral in Palasa Health Department Transport in JCB - Sakshi

పలాసలో ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీతో తరలిస్తున్న దృశ్యం

బంధాలు, ప్రేమానుబంధాలు.. కరోనా దెబ్బకు పటాపంచలవుతున్నాయి. ఊహించని రీతిలో వచ్చి పడ్డ ఈ మహమ్మారి మనుషుల మధ్య గోడలు కట్టేస్తోంది. ఎవరినీ ఏమీ అనలేం.. కనీసం మిగిలున్నవారైనా క్షేమంగా ఉండాలి కదా.. పలాస–కాశీబుగ్గలో శుక్రవారం జరిగిన ఓ అరుదైన ఘటన గుండెను కదిలించేలా ఉంది. శ్మశానానికి తరలిస్తుండగా కరోనా ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిసి మృతదేహాన్ని బంధువులు వదిలేయగా... మున్సిపల్‌ సిబ్బంది జేసీబీతో తరలించడం వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్‌ నివాస్‌... పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌లను సస్పెండ్‌ చేశారు. 

కాశీబుగ్గ: మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో వీధుల గుండా తరలిస్తున్న వీడియో విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు, కోడలు ఇటీవల రైలులో ఇంటికి చేరుకున్నారు. అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వేరే ఇంట్లో ఉండే అవకాశం లేక ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ కలిసే జీవనం సాగించారు. 

హుటాహుటిన చేరుకున్న కలెక్టర్‌

ఈ ఘటన గురించి సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో అధికంగా కరోనా అనుమానిత కేసుల నమోదు, వరుస మరణాలపై ఆరా తీశారు. మృతదేహం తరలింపు విధానంపై పలాస తహసీల్దారు మధుసూదన్, మున్సిపల్‌ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు జరిపి అమానవీయ ఘటనకు బాధ్యులను చేస్తూ పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌లను సస్పెండ్‌ చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న ఉదయపురం, కాశీబుగ్గలలో పర్యటించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణంలో సమీక్షించారు. కరోనా కట్టడికి మరి న్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఎంఅండ్‌హెచ్‌ఓ చెంచయ్య వచ్చారు. ఆర్‌డీఓ కిషోర్‌ కుమార్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ లీల, ఎంపీడీఓ రమేష్‌నాయుడు, డాక్టర్‌ జోగి గౌతమ్‌   పాల్గొన్నారు.

కుటుంబ సభ్యుల నమూనాల సేకరణ
మృతుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులందరి నుంచి నమూనాలు సేకరించి, పరీక్షకు పంపారు. కాంటాక్ట్స్‌ గుర్తించేపనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంతి తన సిబ్బందితో పన్నెండు మంది కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ సేకరించారు.  

కరోనా లక్షణాలతో వృద్ధురాలి మృతి!
సోంపేట: పట్టణంలోని కోర్టుపేట వీధిలో కరోనా లక్షణాలతో గురువారం రాత్రి  వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ కె.శ్రీనివాసులు స్థానిక అధికారులతో కలసి కోర్టుపేట వీధిని శుక్ర వారం పరిశీలించారు. ఈ వీధిని కంటైన్‌మెంట్‌ జోన్‌గా అధికారులు  ప్రకటించారు. కాకినాడ రిపోర్టు రావల్సి ఉందని వైద్య సిబ్బంది తెలియజేశారు. కోర్టు పేట వీధివారు కంటైన్‌మెంట్‌ నిబంధనలు పాటించి స్థానిక అధికారులకు సహకరించాలని స్థానికులను జేసీ కోరారు. కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌ ఉన్నవారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు,  తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్, ఉప తహసీల్దార్‌ బి.అప్పలస్వామి, ఈవో జ్యోతిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.  

మృతుల పట్ల మానవత చూపండి
కరోనా సమయంలో సంభవించే మరణాల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్‌ నివాస్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పలాసలో శుక్రవారం జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమన్నా రు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టపైన విధానాలు పాటించాలన్నారు. సందేహాలుంటే పై అధికారులను సంప్రదించాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. కోవిడ్‌ మరణాలకు సంబంధిత ప్రొ టోకాల్‌ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement