కర్నూలు(కలెక్టరేట్)
గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో)గా ఎంపికైన వారి జాబితాను అధికార యంత్రాంగం సోమవారం ఉదయం విడుదల చేసింది. వీఆర్వోలుగా ఎంపికైనవారి వివరాలను కలెక్టర్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై పెట్టారు.
ఎంపికైనట్లుగా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. పోస్టింగ్ ఉత్తర్వులను కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా అభ్యర్థులకు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీఆర్వో పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. 1 నుంచి 4వ ర్యాంకు సాధించిన వి.కృష్ణారెడ్డి, ఎర్రం విజయకుమార్, కట్టా దస్తగిరి, రొక్కం వేణుగోపాల్‌లు బీసీ- బీకి చెందినవారు.
వీరు వరుసగా మొదటి నాలుగు ర్యాంకులు సాధించి ఓపెన్ కాంపిటీషన్‌లో వీఆర్వోలుగా ఎంపికై రిజర్వేషన్ కోటాలో నలుగురికి అవకాశం కల్పించారు. ఇలా పలువురు రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్ సాధించి ఓపెన్‌లో ఉద్యోగాలు సంపాదించడం విశేషం. వీఆర్వోగా సంబంధిత తహశీల్దార్‌కు జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన రోజు నుంచి వీఆర్వోలకు జీతం లభిస్తుంది. వికలాంగుల్లో వీహెచ్‌కు 1, హెచ్‌హెచ్‌కు 1, ఆర్తోకు 1 పోస్టు ప్రకారం ఉన్నాయి. వీరి వికలత్వ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడానికి హైదరాబాదుకు పంపడం వల్ల మూడు పోస్టులకు అభ్యర్థులను ప్రకటించలేదు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఇద్దరిని పిలువగా రోస్టర్, మెరిట్ ఆధారంగా వీఆర్వోలను ఎంపిక చేశారు.
కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులు, ర్యాంకులు ఇలా ఉన్నాయి:
ఓసీ జనరల్‌లో కటాఫ్ మార్కులు 93. కటాఫ్ ర్యాంకు 32 వరకు ఉంది. ఓసీ స్త్రీలు మార్కులు 86, ర్యాంకు 493, ఎస్సీ జనరల్ మార్కులు 90, ర్యాంకు 144, ఎస్సీ స్త్రీలు మార్కులు 79, ర్యాంకు 1688, ఎస్టీ జనరల్‌లో మార్కులు 85, ర్యాంకు 595, ఎస్టీ స్త్రీలలో మార్కులు 69, ర్యాంకు 5,275, బీసీ-ఎ జనరల్‌లో మార్కులు 93, ర్యాంకు 46, బీసీ-ఎ స్త్రీలలో మార్కులు 84, ర్యాంకు 732, బీసీ-బీ జనరల్‌లో మార్కులు 93, ర్యాంకు 58, బీసీ-బీ స్త్రీలలో మార్కులు 83, ర్యాంకు 904, బీసీ-సీ జనరల్‌లో మార్కులు 90, ర్యాంకు 145, బీసీ-డీ జనరల్‌లో మార్కులు 92, ర్యాంకు 83, బీసీ-డీ స్త్రీలలో మార్కులు 83, ర్యాంకు 892, బీసీ-ఈ జనరల్‌లో మార్కులు 91, ర్యాంకు 98, బీసీ-ఈ స్త్రీలలో మార్కులు 84, ర్యాంకు 706, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్‌లో మార్కులు 80, ర్యాంకు 1,254 వరకు వీఆర్వో ఉద్యోగాలు వచ్చాయి.