కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నిరుద్యోగులను ఊరిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 105 వీఆర్వో పోస్టులు, 176 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్‌ఓలకు కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏలకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వీఆర్‌ఓ పోస్టులను జిల్లా యూనిట్‌గా.. వీఆర్‌ఏ పోస్టులు ఏ గ్రామంలో ఉంటే వారే అర్హులుగా నిర్ణయించామన్నారు. ఓసీ, బీసీలకు ఫీజు రూ.300లు కాగా.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. వికలాంగులకు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపునిచ్చామని.. అయితే సదరం ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ రెండు పరీక్షలు రాసేవారు రెండు ఫీజులను చెల్లించాల్సిందేనన్నారు.
జనవరి 12వ తేదీ వరకు జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చని, దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని తెలిపారు. www.ccla.cgg.gov.in సైట్‌లో జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తులను పంపవచ్చన్నారు. హాల్ టిక్కెట్లను జనవరి 19 నుంచి పరీక్ష జరిగే ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వీఆర్‌ఓ పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 36 ఏళ్లలోపు వారు అర్హులని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల సడలింపు ఉంటుందన్నారు. వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 37 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు సడలింపునిచ్చామన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్‌ఓ అభ్యర్థులకు.. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు.
నిరుద్యోగుల ఆనందహేల
Published Sat, Dec 28 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement