కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కొత్తగా ఎంపికైన వీఆర్వోలు త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు. అన్ని జిల్లాలో ఎంపిక ప్రక్రియ పూర్తయి శిక్షణ పొందుతుండగా.. కర్నూలులో వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా పోస్టింగ్‌లు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీ నాటికే అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో మూడు వికలాంగుల పోస్టులు మినహా 102 వీఆర్వో పోస్టులను మెరిట్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపిక చేశారు. కానీ పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోస్టింగ్‌ల ప్రక్రియ పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది.
అధికారులు మాత్రం పోస్టింగ్ ఉత్తర్వులు రిజిష్టర్ పోస్టు ద్వారా ఇళ్లకే పంపినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఒక్కరికీ ఉత్తర్వులు అందకపోవడం గమనార్హం. వీఆర్‌ఓగా ఎంపికైనట్లు రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం ఇచ్చారే తప్ప పోస్టింగ్ ఉత్తర్వులు అందలేదని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులు కావాలనే పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ మంచి స్థానాల కోసం పైరవీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పోస్టింగ్ ఉత్తర్వులను రిజిస్టర్డ్ పోస్టులో పంపినట్లు తెలిపారు.
త్రిశంకు స్వర్గంలో నూతన వీఆర్వోలు
Published Wed, Mar 12 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement