సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడేందుకు వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 నివారణ చర్యలు చేపట్టేందుకు రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా ఆ మొత్తం జమచేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉదారతను ప్రశంసిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కోవిడ్ నివారణ చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు.
కరోనా పోరాటంలో రియలన్స్ పాత్ర
కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేసిన రియలన్స్ ఇండస్ట్రీస్ .. పీఎం కేర్స్‌కు ఇప్పటికే రూ. 530 కోట్లకు పైగా అందించింది. వైరస్ సవాళ్లను ఎదుర్కోవడంలో దేశానికి సాయం చేసేందుకు సదా సిద్ధమని ప్రకటించింది. ఆ దిశగా కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు రిలయన్స్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆస్పత్రిని కోవిడ్-19 సేవలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉచిత భోజనం అందించే కార్యక్రమాలు చేపట్టింది. ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం రోజూ లక్ష మాస్కులు, వేలాది పీపీఈ కిట్లను ఉత్పత్తి చేసి ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వాహనాలకు ఉచితంగా ఇంధనం అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది భారతీయులకు నిత్యావసరాలను ఇంటికే సరఫరా చేస్తోంది.
సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ..
►కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.8.60 కోట్ల విరాళం ప్రకటించింది. సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రతినిధులు రూ.8.60 కోట్ల చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు.
►సీఎం సహాయనిధికి అదానీ ఫౌండేషన్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఆన్‌లైన్‌లో విరాళాన్ని జమ చేశారు.
►సీఎం సహాయ నిధికి శ్రీ విజయ విశాఖ మిల్క్ కంపెనీ రూ.2 కోట్లను విరాళం ప్రకటించింది. డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆనంద్ రూ.2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందజేశారు.
►సీఎం సహాయనిధికి దేవి ఫిషరీస్ లిమిటెడ్ రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించింది. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ సంస్థ డైరెక్టర్స్ సురేంద్ర,వీర్రాజు రూ.కోటి చెక్కును అందించారు.
►సీఎం సహాయనిధికి మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ మాధవిబాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టాభిరామచౌదరి రూ.20 లక్షల నగదును చెక్కు రూపంలో సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment