పోలీసు బాస్ ప్రక్షాళన తంత్రం
- తొలుత వీఆర్‌కు పాల్తూరు ఎస్‌ఐ
- మళ్లీ ముగ్గురు హైవే సిబ్బంది రిమాండ్‌కు..
అనంతపురం క్రైం : పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలన్నదే ఎస్పీ సూరపరాజు వెంకట రాజశేఖర్‌బాబు ప్రధాన ధ్యేయం. వివిధ సమస్యలు, ఇబ్బందులపై ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా, నమ్మికతో స్టేషన్ మెట్లెక్కినపుడే పోలీసులపై పూర్తి విశ్వాసం ఉంటుందనేది ఆయన భావన. దీంతో నేరస్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అదే సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడుతున్న పోలీసులపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాల్తూరు ఎస్‌ఐ రాజశేఖర్‌ను వీఆర్(వేకెన్సీ రిజర్వ్‌డ్)కు పంపడమే ఇందుకు ఉదాహరణ.
పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకముక్కల గ్రామానికి చెందిన వెంకటేష్ తనకు చెందిన 12 గొర్రెలు చోరీ అయ్యాయని సాధారణ ఎన్నికలకు మునుపు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి దాకా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మంగళవారం గుంతకల్లులో నిర్వహించిన ‘పోలీసు ప్రజా బాట’ సందర్భంగా బాధితుడు నేరుగా ఎస్పీకి తన గోడు వినిపించడంతో ఎస్పీ వెంటనే ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.
తర్వాత వంతు హైవే పెట్రోలింగ్ సిబ్బందిదే..
జాతీయ రహదారిలో ప్రమాదాలు, దోపిడీల నివారణ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు నిత్యం గస్తీ నిర్వహించాల్సిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది కొందరు ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి అక్రమార్జనకు అంతుపొంతూ ఉండడం లేదు. మంగళవారం రాత్రి అలా జాతీయ రహదారిపైకి వెళ్లిన ఓ కుటుంబ సభ్యుల పట్ల హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ మల్లికార్జున, హోంగార్డులు మురళీమోహన్, చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించి, లంచం వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. వారి తీరుపై బాధితులు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే టూ టౌన్ పోలీసుల ద్వారా విచారణ జరిపించి వారిని సస్పెండ్ చేశారు. అంతటితో ఆగక కేసు నమోదుకు ఆదేశించారు. తర్వాత ఆ ముగ్గురు నిందితుల్ని రిమాండ్‌కు పంపారు.
పోలీసు శాఖలో కలకలం.. అక్రమార్కుల్లో వణుకు..
‘బాస్’ చర్యలు పోలీసు శాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ చర్యలపై ప్రజల నుంచి హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండగా... పోలీసు అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించరని ఈ రెండు ఘటనల ద్వారా ఎస్పీ రుజువు చేశారు. పోలీసు శాఖకు ‘మచ్చ’ తె స్తున్న సిబ్బంది వివరాలను ఎస్పీ రహస్యంగా సేకరించారు. ఏమాత్రం అవకాశం వచ్చినా వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది.
కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డుల అరెస్ట్
అనంతపురం క్రైం : ఖాకీలమంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి డబ్బు వసూలు చేసిన ఘటనలో ఒక కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు కటకటాలపాలయ్యారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం నగరంలోని ఆశా కార్పొరేట్ ఆస్పత్రి ఎండీ సోమయాజులు కుమార్తె మాళవిక, అల్లుడు, కుమారుడు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కారులో వెళ్లి జాతీయ రహదారిలో ఉన్న కారు కంపెనీ సమీపంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో హైవే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మల్లికార్జున, హోంగార్డులు మురళీమోహన్, చంద్రశేఖర్ వారి వద్దకు వెళ్లారు. ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? అంటూ గద్దించారు. ఆపై డబ్బు డిమాండ్ చేశారు. చివరకు వెయ్యి రూపాయలు వసూలు చేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనతో మనోవేదనకు గురైన బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.