అద్దె కొంపల్లో అంగన్‌వాడీలు!
సొంత భవనాలు: 10,129
అద్దె భవనాలు: 34,116
ఏటా రూ.70 కోట్లు కిరాయి కింద చెల్లింపు
హైదరాబాద్: అమ్మ ఒడికి దూరమైన చిన్నారుల కోసం ఏర్పాటైన అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెకొంపల్లో అల్లల్లాడుతున్నాయి. కేంద్రమే సింహభాగం నిధులు సమకూరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చొరవ చూపకపోవటంతో కొత్త భవనాల నిర్మాణానికి దిక్కులేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 55,024 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 48,399 ప్రధాన అంగన్‌వాడీలు, 6,625 మినీ కేంద్రాలున్నాయి. ఇందులో 10,129 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 34,116 కేంద్రాలు అద్దె కొంపల్లో నడుస్తున్నాయి. మరో 8,090 కేంద్రాలు రెంట్ ఫ్రీ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 73 శాతం భవనాలు అద్దె చెల్లింపు కింద నడుస్తున్నాయి. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఐసీడీఎస్ విభాగం నగరాల్లో రూ.3 వేలు చొప్పున, పట్టణాల్లో రూ. 1500, పల్లెల్లో రూ.500 వంతున అద్దె చెల్లిస్తోంది. అద్దెల కింద నెలకు సగటున రూ.5.79 కోట్లు అంగన్‌వాడీలకు చెల్లిస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.70 కోట్ల ప్రజాధనం అద్దె కింద కడుతున్నారు.
అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కొన్నిటికి నేరుగా నిధులు మంజూ రు చే స్తుండగా, జిల్లా పరిషత్‌ల నుంచి 15 శాతం గ్రాంటు ద్వారా కొన్ని నిర్మిస్తున్నారు. జెడ్పీ సీఈవోల పర్యవేక్షణ కొరవడటంతో పేరుకు మాత్రమే కేటాయింపులు కనిపిస్తున్నాయి. నిర్మాణాలు మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. కలెక్టర్ల పర్యవేక్షణ లేకుంటే నిధులు పక్కదోవపడుతున్నాయి. చాలా చోట్ల మండల స్థాయికి వచ్చేసరికి మండలాధ్యక్షులు మొండి చేయి చూపుతున్నారు. తొంబై శాతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక సొంత భవనాలు ఉన్న అంగన్‌వాడీల్లో సగం కేంద్రాలు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి.