ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతించాలి
ముఖ్యమంత్రికి, కేంద్ర మానవ వనరుల మంత్రికి జగన్ వినతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న డీఎస్సీ-2014 పరీక్షల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని, ఆ మేరకు నిబంధనలు సవరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గత నెల 30న ఒక లేఖ రాశారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రికి మరో లేఖ రాశారు. 2009 విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి 2010లో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను పేర్కొన్న నిర్దేశిత సూత్రాలను సవరించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో 2 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉండగా.. స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎస్జీటీ పోస్టుల భర్తీకి జరిగే పరీక్షల్లో పాల్గొనడానికి బీఈడీ పట్టభద్రులను అనర్హులుగా చేయడం వల్ల వారు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని జగన్ తన లేఖల్లో పేర్కొన్నారు. ఎన్‌సీటీఈ జారీ చేసిన నిబంధనల్లో బీఈడీ పట్టభద్రులు కేవలం 6 నుంచి 8 తరగతులకు మాత్రమే బోధించాలని పేర్కొన్నారన్నారు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నందున, బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించేలా మినహాయింపును కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ సీఎంను కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీఈడీ పట్టభద్రులు కూడా ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు రాసుకునే అవకాశం ఉండేదని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీఈడీ పట్టభద్రులకు ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు రాసుకునేలా అర్హతను సాధిస్తూ కేంద్రం నుంచి అనుమతి పొందిన విషయాన్ని తన లేఖల్లో పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి ఈ విషయమై విజ్ఞప్తి చేసి అనుమతి సాధించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు.. తమ రాష్ట్రం వినతిని సానుకూలంగా పరిశీలించి మినహాయింపు నివ్వాలని కేంద్రమంత్రిని జగన్ కోరారు.
పత్తికొండకు నేడు జగన్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండకు వెళుతున్నారు. ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి తొలుత గాజులదిన్నె ప్రాజెక్టు పంప్‌హౌస్‌కు చేరుకుని, పనులను పరిశీలించి స్థానిక రైతులతో ఆయన మాట్లాడతారు. అనంతరం డోన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు పత్తికొండలో ఏర్పాటయ్యే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.