
ఏజెన్సీలో అలజడి.!
- వాడుకలోకి వస్తున్న మరో కొత్ పేరు
- ఏవోబీకి ప్రత్యామ్నాయం
- కార్యదర్శిగా వేణు
- ప్రశాంతంగా నిసరన, బంద్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేర వినగానే ముందుగా గుర్తుకొచ్చేది మావోయిస్టులే..ఇప్పుడక్కడ కొత్తగా మల్కన్‌గిరి-విశాఖ-కోరాపుట్(ఎంవీకే) అనే మరో పేరుతో దళసభ్యుల అలజడి రేగుతోంది. వారి ప్రాబల్యం పెరుగుతోందనే సంకేతాలతో పోలీసు వర్గాల్లో కలకలం చోటుచేసుకుంటోంది. ఇటీవల వరుసగా మావోయిస్టు నేతలు, మిలీషియా సభ్యుల లొంగుబాట్లతో సంబరపడుతున్న అధికారులకు సరిహద్దులో కొత్త పేరు పుట్టుకురావడం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా, వారు పూర్తి ఆధిపత్యం సాధించిన కీలక ప్రదేశంగా పిలవబడే ఏవోబీకి ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎంవీకే పేరు విశాఖ మన్యంలో వినిపిస్తోంది.
ఈ ప్రాంతానికి ఎంవీకే కార్యదర్శిగా వేణు అనే ఉద్యమ నేతను కేంద్ర కమిటీ నియమించినట్లు సమాచారం. ఇటీవల అతని పేరుమీద ఏజెన్సీలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. దీంతో కొత్తగా ఏదో జరుగుతోందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏజెన్సీలో మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి చురుగ్గా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు నంబల్ల కేశవరావు అలియాస్ గంగన్న ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లారు. మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్‌సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియాస్ రవి, సరిత, ఆజాద్, ఆనంద్‌లు కొద్ది రోజుల క్రితమే వేసవి పండుగల్లో ఏజెన్సీ గిరిజనులతో సమావేశాలు నిర్వహించారనే సమాచారం పోలీసుల వద్ద ఉంది.
తాజాగా వినిపిస్తున్న వేణుపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు గత నెల 20న ముంచంగిపుట్టు మండలంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందడండంతో ఆగ్రహం చెందిన దళసభ్యులు గత నెల 24న ఓ పొక్లెయిన్‌ర్‌ను తగులబెట్టారు. అంతటితో శాంతించకుండా మన్యంలో ఈ నెల ఒకటవ తేదీ నుంచి నిరసన వారాని, సోమ, మంగళవారాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. రెండు రోజుల బంద్ ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసింది. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ పలు సర్వీసులను నిలిపివేసింది. రెండు రోజుల క్రితం జీకే వీధి మండలం కుంకుంపూడిలో అమరవీరుల స్థూపాన్ని అన్నలు ఆవిష్కరించారు. తాజా పరిణామలతో పోలీసు ప్రత్యేక బలగాలు అడవిలో అణువణువూ జల్లెడపడుతున్నాయి. ఘాట్ రోడ్లపై విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. మిలీషియా సభ్యుల కదలికలపై నిఘా ఉంచారు. పేరు మార్పుపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.