
సాక్షి, అమరావతి: ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు, నియామకాల ప్రక్రియ సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ఆయన హితవు పలికారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను అరెస్టు చేయించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు.
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
కాగా, సెప్టెంబరు 1 నుండి 8 వరకూ జరిగే ఈ రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు మంత్రి వివరించారు. మొత్తం 5,314 పరీక్ష కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాల నిఘా, సాయుధులైన భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను భద్రపరుస్తున్నట్లు వివరించారు. పరీక్ష నిర్వహణకు 1,22,554 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించామన్నారు.
12.85 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్
మొత్తం 15.50 లక్షల మంది పరీక్షలు రాస్తుండగా.. మంగళవారం ఉదయానికి 12.85 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటర్ గుర్తింపు, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదో ఒకటి ఒరిజినల్) తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ 13 జిల్లాల్లో సుమారు 10,082 సర్వీసులు నడుపుతోందన్నారు. అంధత్వం, శారీరక చలనం లేని వ్యక్తులకు పరీక్షలో 50 నిమిషాలపాటు అదనపు సమయం కేటాయిస్తామన్నారు. అభ్యర్థులను సులభంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఆర్టీవో అధికారులు ఆటో యూనియన్లతో మాట్లాడుతున్నారన్నారు. అలాగే, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పరీక్షా కేంద్రాల లొకేషన్‌ను కూడా అభ్యర్థులకు తెలియపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రెండు మూడ్రోజుల్లోఇసుక ధరలు
ఇదిలా ఉంటే.. ఇసుక కొత్త ధరలను రెండు మూడ్రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కొత్త పాలసీలో రీచ్‌ల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ విధానంలో ఎవరైనా సిండికేట్ అయి రీచ్‌ల నిర్వహణ టెండర్లలో పాల్గొని ఉంటే.. అలాంటి వాటిని రద్దుచేస్తామని మంత్రి స్పష్టంచేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానన్న వ్యక్తి అరెస్టు
చిత్తూరు అర్బన్ : గ్రామ సచివాలయం ఉద్యోగం ఇప్పిస్తానంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. రాష్ట్ర మంత్రి తనకు తెలుసని చెబుతూ ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల ఇవ్వాలని ఫోన్‌లో చెప్పడం.. మరో వ్యక్తి దీన్ని వాట్సప్‌లో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న పోరుమావిళ్ల రమేష్‌బాబు (52) అనే వ్యక్తి తన సన్నిహితుడైన అహ్మద్ అనే వ్యక్తితో.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి బంధువులు తెలుసునని, పోస్టుకు రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్‌లో మాట్లాడాడు. ఈ సంభాషణను అహ్మద్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో విషయం మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దర్యాప్తు చేసిన సీఐ భాస్కర్‌రెడ్డి రమేష్‌రెడ్డిని అరెస్టుచేశారు. అభ్యర్థులు ఇలాంటి వాటిని నమ్మొద్దని.. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment