సాక్షి, గుంటూరు : ఈ రబీలో రైతులు కాడి కిందేస్తున్నారు. సాగర్ జలాల విడుదలపై స్పష్టత లేకపోవడం, ఖరీఫ్ సాగులో పడిన కష్టాలను తలచుకుని దాళ్వా సాగుకు వెనుకంజవేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 74,034 హెక్టార్లలో మాత్రమే రబీ సాగు చేపట్టారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు ఖిల్లాగా పేరున్న గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సాగుకు అష్ట కష్టాలుపడిన రైతాంగం దాళ్వాకు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో జూన్‌లో ప్రారంభం కావలసిన ఖరీఫ్ సాగు దాదాపు 45 రోజులకు పైగా ఆలస్యమైంది. ఫలితంగా డిసెంబరు చివరినాటికి రావలసిన పంటలు ఇంకా రైతు ఇంటికి చేరలేదు. దీంతో రబీ మందకొడిగానే సాగవుతోంది. ప్రధానంగా సాగర్ జలాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నీటి విడుదల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు సాగుకు వెనుకంజ వేస్తున్నారు. రబీలో రెండో పంటగా వరిసాగుకు ఆసక్తి చూపటం లేదు.
ఆరుతడి పంటలకు మొగ్గు...
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో రబీలో ఎక్కువ మంది రైతులు ఆరుతడి పంటలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న వైపు అధిక శాతం మంది రైతులు మొగ్గు చూపుతున్నారు.
ఖరీఫ్‌లో వర్షాభావానికితోడు పత్తి పంటను తెగుళ్లు ఆశించడంతో దిగుబడులు తగ్గాయి. దీనికి తగ్గట్టే మా ర్కెట్‌లో కూడా పత్తికి సరైన ధర రావడం లేదు. కనీసం పెట్టుబడి వార వస్తే చాలని రైతులు దేవుళ్లకు మొక్కుతున్నారు. పెట్టుబడుల కోసం బయట తెచ్చిన అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడుతున్నారు.
మరో వైపు ఖరీఫ్ ధాన్యంతోపాటు గత దాళ్వాలో నిల్వ ఉంచిన ధాన్యానికీ మార్కెట్‌లో ధర రావడం లేదు. ఆదుకోవలసిన ప్రభుత్వం నామమాత్రంగా సీసీఐ కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. ఈ కేంద్రాల్లో నిబంధనల పేరుతో ధాన్యం కోనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో రబీ సాగు చేస్తే మరోసారి చేతులు కాల్చుకోవడమేనన్న భావనలో రైతులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం74,034 హెక్టార్లలో మాత్రమే రబీ సాగు చేపట్టారు.పంటలవారీగా వివరాలు ఇలావున్నాయి...
రబీ పట్టని రైతులు
Published Fri, Dec 26 2014 2:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement