అడుగడుగునా ఆటంకాలే... | Respect at every step ... | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆటంకాలే...

Published Wed, Oct 15 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

అడుగడుగునా ఆటంకాలే...

అడుగడుగునా ఆటంకాలే...

  • మళ్లీ వెనక్కి మళ్లిన తిరుపతమ్మ వజ్రకిరీటం
  •  నాణ్యతపై జెమాలజిస్టు అసంతృప్తి
  •  పదిరోజుల్లో సరిచేసి ఇస్తామన్న తయారీదారులు
  • పెనుగంచిప్రోలు : స్థానిక తిరుపతమ్మ ఆలయంలోని అమ్మవారి ప్రతిమకు అలంకరించేందుకు తీసుకొచ్చిన వజ్రకిరీటం మళ్లీ వెనక్కు వెళ్లింది. కిరీటంలో పొదిగిన వజ్రాలు ఊడిపోవడం, అవి నాణ్యమైనవేనని నిర్ధారించకపోవడంతో జెమాలజిస్టు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో తయారీదారులు మార్పులు చేసేందుకు మరోసారి వెనక్కు తీసుకెళ్లారు. ఈ కిరీటాన్ని అమ్మవారికి అలంకరించేందుకు జరుగుతున్న జాప్యంపై భక్తులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
     
    కిరీటాన్ని తయారు చేసిన విజయవాడ చందన జ్యూలర్స్ ప్రతినిధులు దానిని మంగళవారం ఆలయానికి తీసుకొచ్చారు. గతంలోలానే ఈ సారి కూడా వజ్రాలు కొన్ని నాణ్యమైనవి కావని, వాటిని సరిగా పొదగలేదని కిరీటాన్ని పరిశీలించిన జెమాలజిస్ట్ అరవింద్ తెలిపారు. దీంతో కిరీటాన్ని తిరిగి తయారీదారులు తీసుకు వెళ్లిపోయారు. అనేక అవరోధాల మధ్య అమ్మవారి వజ్రకిరీటం తయారీకి గతంలో పని చేసిన ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారు.

    తయారీ పనులను విజయవాడ చందన జ్యూయలర్స్‌కు అప్పగించగా ఆ సంస్థ నిర్వాహకులు ముంబాయిలో కిరీటాన్ని తయారు చేయించారు. దీనికి సుమారు రూ.1.70 కోట్ల ఖర్చయింది. ఆజాద్ హయాంలోనే పూర్తికాని కిరీటాన్ని తీసుకొచ్చి, అమ్మవారికి అలంకరించిన అనంతరం చందన జ్యూయలర్స్ ప్రతినిధులు వెనక్కు తీసుకెళ్లిపోయారు. అనంతరం ఈవో విజయ్‌కుమార్ ఆ కిరీటాన్ని పూర్తి చేయించారు.

    అయితే గతంలో ఒకసారి జెమాలజిస్టు కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో కిరీటం తయారీదారులు తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించి దేవాదాయశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆలయ ఈవో చందు హనుమంతరావు, దేవాదాయశాఖ ఏసీ దుర్గాప్రసాద్, జేవీవో ఎస్‌వి.ఎస్.ప్రసాద్ ఈ కమిటీలో ఉన్నారు. వీరి సమక్షంలో మంగళవారం రెండోసారి ఆలయానికి వచ్చిన కిరీటాన్ని జెమాలజిస్ట్‌లు పరిశీలించి, గతంలోలానే పొదిగిన చిన్న వజ్రాలు ఊడిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
     
    అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో చెప్పిన మార్పులు పూర్తిగా చేపట్టలేదని, వజ్రాలు సహజసిద్ధమైనవని సర్టిఫికెట్‌లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. కిరీటంపై వజ్రాల ఫిటింగ్ విషయంలో గట్టి జిగురు పదార్థం వాడకపోవడంతో ఊడిపోతున్నాయని, ఈ సారి వాటి చుట్టూ బంగారంతో నింపాలని సూచించామని పేర్కొన్నారు.

    చందన జ్యూయలర్స్ ప్రతిని ధులు మాట్లాడుతూ జెమాలజిస్టు చెప్పిన మార్పులుచేసి పది రోజుల్లో కిరీటాన్ని అప్పగిస్తామన్నారు. ఈవో మాట్లాడుతూ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే కిరీటాన్ని తయారు చేయాలని చందన జ్యూయలర్స్ కోరామని తెలిపారు. ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఏఈవోలు సీహెచ్.ప్రసాద్, మేడా గోపాలరావు, ఈఈ వైకుంఠరావు, ఎస్‌ఐ నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement