రెండు రకాల మామిడి మొక్కల్ని అంటుకట్టడం(గ్రాఫ్టింగ్) చూసుంటాం. రంగు రంగుల గులాబీ మొక్కల్ని అంటుకట్టి కొత్త రంగును పుట్టించడం మనందరికీ తెలిసిందే.. అయితే వంగ మొక్కకు, టమాటా మొక్కను అంటుగడితే.. ఏ కాయలు కాస్తాయి. ఆ కాయలు ఏ రంగులో, ఆకారంలో ఉంటాయి? హార్టికల్చర్ రంగంలోని సరికొత్త సాంకేతికతతో మన రాష్ట్రంలో ఈ రకమైన ప్రయోగాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. వారి కృషి ఫలితంగా ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు వంగటమాటా పండిస్తూ లాభాలు సాగుచేస్తున్నారు. ఈ వంగటమాటా ప్రత్యేకత తెలుసుకోవాలంటే వెంటనే స్టోరీలోకి వెళ్లాల్సిందే..
– పలమనేరు(చిత్తూరు జిల్లా)
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండే పంట టమాటా. ఇది తీవ్ర వర్షాభావాన్ని, ముంపును తట్టుకోలేదు. పైగా తెగుళ్ల తీవ్రత ఎక్కువ. పంట ఎక్కువ వచ్చినప్పుడు తొందరగా పాడై ఎగుమతికి పనికిరాకుండా పోతాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కుప్పంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) శాస్త్రవేత్తలు రూపొందించిందే ఈ వంగటమాటా. గ్రాఫ్టింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన ఈ రకం చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. వంగ నారుకు టమాటా నారును అంటుకట్టి ఈ వంగటమాటాలు పండిస్తున్నారు. రంగు, రుచి, వాసన, ఆకారంలో ఇవి మామూలు టమాటాల్లానే ఉంటాయి.
ఎలా సాధ్యమైంది
టమాటా, వంగ నారును ఒకేసారి సిద్ధం చేసుకుంటారు. అనంతరం వంగ నారు కాండం మొదట్లో కత్తిరించి దానికి టమాటా పైభాగంలోని మొలకను అంటుకడతారు. ఇలా పెరిగిన టమాటా మొక్కలను రైతులకు అందిస్తున్నారు. ఈ మొక్క వేరు భాగంలో వంగ లక్షణాలు, మిగతా మొక్క టమాటా లక్షణాలతో ఉంటుంది. అందువల్ల వంగతో అంటుకట్టినా టమాటాలే కాస్తాయి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏడీ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఇక్రిశాట్ సైంటిస్ట్ కిషోర్ ఈ ప్రక్రియకు ఆజ్యం పోశారు. ఆ కేంద్రంలోని ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. అందుకోసం సీఓఈ సెంటర్‌లో ఉండే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల సాయం తీసుకున్నారు.
వంగ నారుకు టమాటా నారును అంటుకట్టిన దృశ్యం
లాభాలివీ
- మొక్క నీటి ఎద్దడిని, ముంపును తట్టుకుంటుంది.
- టమాటాను ఆశించే వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లను నివారించవచ్చు.
- భూమి ద్వారా వచ్చే వ్యాధులు తగ్గుతాయి.
- మొక్క బలంగా పెరిగి.. పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి.
- మామూలు టమాటా 25 కోతలు వస్తే ఇది 60 కోతల దిగుబడి ఇస్తుంది.
- వంగ స్వభావం వల్ల టమాటా పైపొర మందంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు మార్కెటింగ్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment