నోటీసులొస్తే కేసు నమోదైనట్లేనా?: సుమన్
► పేర్లు బహిర్గతం చేయడం సరికాదు
► హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతి పెచ్చుమీరింది
రేపల్లె: డ్రగ్స్ వినియోగానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ జరపకుండా పేర్లు బహిర్గతం చేయడం సరికాదని సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లేలోని కేఎస్‌ఆర్ రెసిడెన్సీ అధినేత కాటూరి శివనాగబాబు స్వగృహంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో పలువురికి డ్రగ్స్‌కు సంబంధించి నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించగా... నోటీసులు జారీ చేసినంత మాత్రానా కేసులు నమోదైనట్లు కాదు కదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ సంస్కృతి పెచ్చుమీరిందని చెప్పారు. డ్రగ్స్ మత్తులో మునిగితే సమస్యలు పెరుగుతాయే తప్ప తొలగవన్న సంగతి యువత గుర్తుంచుకోవాలని సూచించారు. నాడు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ప్రముఖులు తమ వ్యక్తిత్వం గొప్పగా తీర్చిదిద్దుకుని ఆదర్శంగా నిలిచారన్నారు. యువనటులు టాలెంట్‌తోపాటు వ్యక్తిత్వం ప్రధాన అంశంగా గుర్తించి ముందుకు సాగాలన్నారు. సమావేశంలో కాటూరి శివనాగబాబు, జిల్లా సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలకా వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.