బడ్జెట్‌లో రూ.5,116 కోట్లు కేటాయించండి | Revenue Department Proposal for Finance Department to Allocate the Rs 5116 crore in budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో రూ.5,116 కోట్లు కేటాయించండి

Published Wed, Jul 3 2019 4:31 AM | Last Updated on Wed, Jul 3 2019 8:13 AM

Revenue Department Proposal for Finance Department to Allocate the Rs 5116 crore in budget - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌లో తమ శాఖకు రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ మన్మోహన్‌సింగ్, సాంబశివరావు (స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ) ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్‌ ముందస్తు కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో విభాగాల వారీగా సమావేశమయ్యారు. భూ పరిపాలన, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు సంబంధించి రూ.5,116.40 కోట్లు కేటాయించాలని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆర్థిక శాఖ మంత్రికి నివేదించారు. సాధారణ బడ్జెట్‌ కింద రూ.1,430.40 కోట్లు, వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు రూ.3,686 కోట్లు కలిపి మొత్తం రూ.5,116.40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విజ్ఞప్తి చేశారు. 

కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.25 కోట్లు ఇవ్వండి 
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని  వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా మార్చేసి, అందులో రెండింటిని గిరిజన జిల్లాలుగా చేయాలని, దీంతోపాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని విడగొట్టి పోలవరం గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. జిల్లాల ఏర్పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదని, తర్వాత చేపడతామని, అయినప్పటికీ ఇందుకోసం రూ.25 కోట్ల బడ్జెట్‌ కావాలంటూ ప్రతిపాదించామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్సార్‌సీపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హామీ అమలుకు రూ.13 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ విన్నవించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందుకోసం మొదటి ఏడాది రూ.3,648 కోట్లు కావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది.  

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. 2019–20 బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయిస్తామని.. తద్వారా అధిక శాతం ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసేలా నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు. 

బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీట
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి 
రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక (2019–20) సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ కేటాయింపుల్లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారని ఆయన తెలిపారు. ముందస్తు బడ్జెట్‌ కసరత్తులో భాగంగా మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు అమలు చేయడానికి అయ్యే మొత్తం నిధులు కేటాయించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా అందించడానికి ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.  

పాఠశాల విద్యకు 39,897 కోట్లు ఇవ్వండి 
2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.39,897.42 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. నవరత్నాల హామీల్లో ఒకటైన అమ్మ ఒడి పథకంతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మేరకు నిధులు అవసరమని పేర్కొంది. ఇక ఉన్నత విద్యాశాఖకు రూ.5,027.15 కోట్లు అవసరమని ఆర్థిక శాఖకు బడ్జెట్‌ ప్రతిపాదనలు అందజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement