అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: రోజులు గడుస్తున్న కొద్దీ ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. సమైక్యమే తమ శ్వాస.. ఊపిరి అంటూ విభిన్నరూపాల్లో సమైక్యవాదులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల వైఖరిని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక లోకంతో పాటు పార్టీలకతీతంగా అన్ని వర్గాలు స్వచ్ఛందంగా సమైక్యసమరంలో పాల్గొంటున్నాయి. 47వ రోజు ఆదివారం కూడా సమైక్య ఆందోళనలతో ‘అనంత’ అట్టుడికింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. పాలన పూర్తిగా స్తంభించిపోయినా సమైక్యమే తమ అభిమతమంటూ సమరోత్సాహంతో ముందుకు పోతున్నారు.
‘తెలుగు తేజం’ యాత్రతో ‘అనంత’లో అడుగుపెట్టిన లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణకు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలతో పాటు పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీ నేతలు భారీ సంఖ్యలో జేపీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలు మోహరించినా ఇరువర్గాల నడుమ తోపులాట జరిగింది.
సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రత గుర్తించిన జేపీ.. చివరికి జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేశారు. అంతేకాకుండా తెలుగుతేజం యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ జేఏసీ నేతలు ఇంజనీర్స్‌డేను జిల్లా పరిషత్ ఎదురుగా చేపట్టిన రిలేదీక్షా శిబిరంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ, డీఈ, ఏఈలను ఘనంగా సన్మానించారు.
మునిసిపల్ ఉద్యోగ జేఏసీ రిలేదీక్ష కొనసాగిస్తూ... సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మంచి బుద్ధి ప్రసాదించి ఉద్యమంలో పాల్గొనేలా చేయాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. ముస్లింలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రిలేదీక్షల్లో పాల్గొన్న వారికి సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జాక్టో, హంద్రీ-నీవా ఉద్యోగులు, వాణిజ్యపన్నులశాఖ జేఏసీ, మెడికల్ జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలేదీక్షలు కొనసాగించారు. ధర్మవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల రిలేదీక్ష 47వ రోజూ కొనసాగింది. సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముదిగుబ్బ, పామిడి, పుట్టపర్తి, రొద్దం, గుత్తి, అమడగూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, ఉద్యోగ సంఘాల జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి.
సమైక్యాంధ్ర నినాదాలతో రజకులు రోడ్డుపైనే దుస్తులు ఉతికి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో వివిధ సంఘాల నేతలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగిస్తూ సమైక్య ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు దీక్షలలో కొంత మంది శీర్షాసనం వేసి, మరికొందరు ఖోఖో ఆడి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఓడీ చెరువులో సమైక్యవాదులు బైక్ ర్యాలీతో పాటు రాస్తారోకో నిర్వహించారు. పెనుకొండలో ఆర్డీఓ, తహశీల్దార్లు, వీఆర్వోలు రిలే దీక్షలకు కూర్చుని సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు రిలేదీక్షలు కొనసాగించారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు గోరంట్లలో సమైక్యసెగ తాకింది. సోమందేపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై నాగినాయుని చెరువు పంచాయతీకి చెందిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలో మహిళా ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు రిలే దీక్ష లో పాల్గొన్నారు. వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా శింగనమల, కనగానపల్లిలో సమైక్యవాదులు జలదీక్ష చేశారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు.
పుట్లూరు, గార్లదిన్నె మండలం కల్లూరులో ప్రజలు సమైక్యర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ముస్లింలు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడి సమైక్యవాదాన్ని వినిపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, ముస్లింలు రిలే దీక్షలు చేశారు. హిందీ పరీక్షలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాడిపత్రి సమీపంలోని పెన్నానదిలో అధికారులు, సిబ్బంది నిరసన తెలిపారు. యాడికిలో స్థిరపడ్డ రాజస్తాన్‌వాసులు సమైక్యాంధ్ర నినాదాలతో రిలేదీక్షలు చేశారు. ఉరవకొండలో రిలేదీక్షలు కొనసాగుతుండగా, ఆర్టీసీ జేఏసీ నేతలు ఉరవకొండ నుంచి పెన్నహోబిళం వరకు పాదయాత్ర చేశారు.
ప్రతిధ్వనిస్తున్న.. సమైక్య నినాదం
Published Mon, Sep 16 2013 3:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement