
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి అభివృద్ధి పనిని ఎక్కువ ధరలకు అప్పజెప్పి కమీషనర్లు తీసుకోవడం... కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం... నాణ్యత లేకుండా పనులు నిర్వహించినా పట్టించుకోకపోవడం... ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ అనుయాయుల జేబులు నింపడం... ఇదీ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చేసిన నిర్వాకం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా నిర్వహించే ప్రతి అభివృద్ధి పనికి పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సైతం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఏకంగా రూ.104 కోట్లకు పైగా ప్రభుత్వానికి మిగిల్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు తాజాగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు దక్కించుకుని ఇళ్ల నిర్మాణ పనులు బేస్‌మెంట్ లెవల్లో ఉన్నవాటిని గుర్తించి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఏపీ టిడ్కో రివర్స్‌టెండరింగ్‌కు అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం తేటతెల్లం కానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలో నగరం, పట్టణ ప్రాంతాల్లో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుల వాటాతో కలిపి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. ఇళ్ల నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఏపీ టిడ్కో)కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
జిల్లాలోని ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు పట్టణాల్లో 300 ఎస్‌ఎఫ్‌టీ, 365 ఎస్‌ఎఫ్‌టీ, 430 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంతో 13,024 ఇళ్లను నిర్మించేందుకు పనులు కట్టబెట్టారు. అయితే వీటిలో కేవలం 6,628 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 3,984 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్లో ఉండగా 2,412 ఇళ్లు అసలు మొదలే పెట్టని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయక పోవడం, నిర్మించిన ఇళ్లకు సైతం నీటి సౌకర్యం లేకపోవడం, ఇళ్లలో ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వీటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు మిగతా పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు వారి వాటా డబ్బులు చెల్లించడం కానీ, బ్యాంకు రుణాలు పొందడం కానీ చేయకుండా వదిలేశారు.
ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్:
జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పనుల్లో రివర్స్‌టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఏపీ టిడ్కో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 13,024 ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లు దాటినా కాంట్రాక్టు సంస్థ కేవలం 6,628 ఇళ్లను మాత్రమే వివిధ దశల్లో నిర్మిస్తుండడంతో ప్రస్తుతం బేస్‌మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు రివర్స్‌టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రివర్స్‌టెండరింగ్ ప్రక్రియను ఏపీ టిడ్కో ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభమైన రివర్స్‌టెండరింగ్ ఈనెల 15వ తేదీ వరకు జరగనుంది. 15వ తేదీ ఈ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం స్పష్టం కానుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ముగిసిన రివర్స్‌టెండరింగ్‌లో 15 శాతం తక్కువకు టెండర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అవుతుందనే దానిపై అంతా చర్చించుకుంటున్నారు.
రివర్స్‌టెండరింగ్‌కు ఈనెల 15 వరకు గడువు: టిడ్కో ఈఈ వెంకటేశ్వర్లు
జిల్లాలో బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గత నెల 28వ తేదీ నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాం. ఈనెల 15వ తేదీ వరకు టెండర్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. మొదటి విడత నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లు వేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదా అయిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగే రివర్స్ టెండరింగ్‌కు సైతం ఇదే స్థాయిలో ఆదా అవుతుందని ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment