మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’ | Reverse Tendering In The Supply Of Eggs | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’

Published Thu, Dec 19 2019 8:48 AM | Last Updated on Thu, Dec 19 2019 8:49 AM

Reverse Tendering In The Supply Of Eggs - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు నాణ్యమైన కోడిగుడ్డు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో రుచిగా అందించడంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

విమర్శలకు చెక్‌ చెప్పేందుకు యత్నం 
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటికీ అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చెయ్యడం లేదనీ, రుచిపచీ లేకుండా పిల్లలకు భోజనం పెడుతున్నారనీ, ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారంటూ ఎక్కడో ఒక చోట నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతోపాటు అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి కావనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్‌ చెప్పేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించడంతోపాటు నిర్వాహకులకు డ్రెస్‌ కోడ్‌ ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు మైక్రో స్కోప్‌లని వినియోగించాలని సూచించింది. తాజాగా భోజనంలో అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 పౌల్ట్రీలకు మేలు జరిగేలా.. 
ఇప్పటిదాకా కోడిగుడ్ల టెండర్ల దాఖలు అర్హతలో రకరకాల నిబంధనలు ఉండేవి. బడా వ్యాపార వేత్తలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవారు. నిజమైన పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, రైతులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుండేది కాదు. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత విధానంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కోడిగుడ్డుకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది.

వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి లోపభూయిష్టమైన అంశాలను సవరించి సన్నకారు రైతులు కూడా కోడిగుడ్ల సరఫరాలో పాల్గొనే విధంగా చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో రైతుల నుంచే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తాజాగా కోడిగుడ్ల సరఫరాలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వెలువడే ఉత్తర్వులు మేరకే తదుపరి కార్యచరణ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.  

విద్యా డివిజన్‌ యూనిట్‌గా టెండర్లు  
జిల్లాలో 5,397 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి పదో తరగతి వరకూ 6,48,162 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికోసారి స్కూళ్లకు గుడ్లు సరఫరా చేయాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కోడిగుడ్ల సరఫరాపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సైజు, నాణ్యత, సరఫరాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా యూనిట్‌గా కాకుండా విద్యా డివిజన్‌ యూనిట్‌గా టెండర్లు అప్పగించేలా చర్యలు తీసుకుంది.

అంతేకాకుండా సరఫరా చేస్తున్న గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏజెన్సీల ఎంపికలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లా యూనిట్‌గా కాకుండా డివిజన్‌ యూనిట్‌గా ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో నాలుగు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) విద్యా డివిజన్లు ఉన్నాయి. ఇందుకోసం డివిజన్‌కో టెండర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఐసీడీఎస్‌ నుంచి ఒకరు, డిప్యూటీ డీఈఓ, ఒక ఎంఈఓ, హెచ్‌ఎం (ఆయా డివిజన్లలో డీఈఓ నియమిస్తారు), రవాణా శాఖ నుంచి ఒకరు (జేసీ నియమిస్తారు) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అయితే ఏజెన్సీలకు అర్హత, ఇతర విధివిధానాలు రావాల్సి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement