
దౌసా: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన 90 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. చుడియావాస్ గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాఠశాలలోని 156 మంది విద్యార్థులు రాష్ట్ర పోషకాహార పథకం కింద అందించిన చపాతీ, కూర తిన్నారు. తరువాత వారిలో 90 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైద్య బృందం పాఠశాలకు తరలివచ్చింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో వారిని నంగల్ రాజ్‌వతన్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలోని 49 మంది విద్యార్థులను దౌసా జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారికి వైద్యసేవలు అందించేందుకు అదనంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం నాటికి పిల్లలందరూ కోలుకున్నారని వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు.
అంతకుముందు ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్.. విద్యార్థులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పాఠశాలలో వడ్డించిన ఆహార నమూనాలను సేకరించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి కిరోరి లాల్ మీనా, బీజేపీ నేత జగ్మోహన్ మీనా జిల్లా ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ మధ్యాహ్న భోజనం నాణ్యతపై అనుమానాలను లేవనెత్తింది.