గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం 'వైఎస్‌ జగన్‌' సమీక్ష | YS Jagan Review Meeting on Vizag Gas Leakage Incident - Sakshi
Sakshi News home page

గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Published Fri, May 8 2020 12:54 PM | Last Updated on Fri, May 8 2020 5:25 PM

Review meeting held in Amaravathi over Vizag incident - Sakshi

సాక్షి, అమరావతి : గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు కలెక్టర్‌ వినయ్‌చంద్ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని సీఎస్‌ నీలం సాహ్ని తెలిపారు. ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుందన్నారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారని నీలం సాహ్ని తెలిపారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయన్న సీఎస్‌.. విశాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ వస్తోందన్నారు. (గ్యాస్‌ లీకేజీ ఘటన : హైపవర్‌ కమిటీ ఏర్పాటు)

కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలని సూచించారు. జరిగిన ఘటనను దృష్టిలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా జనావాసాలకు దూరంగా తరలింపుపై తగిన ఆలోచనలు చేయాలన్నారు. అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేదా ఉన్న ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన మార్గాలపైకూడా ఇంజినీర్లతో మాట్లాడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.. (గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement