
భవిత మనదే..
- భవిష్యత్తు మనదే.. అధైర్యపడొద్దు..
- నిర్మాణాత్మకంగా ప్రజల కోసం పనిచేద్దాం..
- రానున్న రోజుల్లో అధికార పార్టీ మోసాలను బయటపెడదాం..
- క్యాడర్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తాం
- వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా నియోజకవర్గ సమీక్షలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘భవిష్యత్తు మనదే.. ఎవరూ అధైర్యపడొద్దు.. జిల్లాలో ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. వైఎస్సార్ సీపీని బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేద్దాం. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ప్రజల కోసం.. ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మకంగా పనిచేద్దాం. పార్టీ ముఖ్య నేతలంతా మీకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాను. సంస్థాగతంగా మరింత బలోపేతం అవుదాం..’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు భవిష్యత్తు నిర్దేశం చేశారు. శనివారం ఆయన విజయవాడ, బందరు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కానూరులోని ఆహ్వానం కల్యాణమండపంలో నిర్వహించారు.
సాక్షి, విజయవాడ : ‘జిల్లా, నగర నాయకత్వాన్ని మరింత పటిష్టం చేద్దాం. అన్ని స్థాయిల్లో కమిటీలు వేస్తాం. వాటిల్లో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కేలా చూస్తాను. విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం..’ అని అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు బందరురోడ్డులోని కానూరు వద్ద ఉన్న ఆహ్వానం కల్యాణమండపంలో శనివారం ప్రారంభమయ్యూయి.
జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో మండలస్థాయి నేతలు మొదలుకుని ముఖ్యనేతల వరకు అందరూ తమ అభిప్రాయాలను జగన్‌కు వివరించారు. అందరి అభిప్రాయూలను ఆయన నోట్ చేసుకున్నారు.
తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఆ తర్వాత సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెడన, మచిలీపట్నం, పశ్చిమ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. సగటున ఒక్కో నియోజకవర్గానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...
బాబు మోసాల్ని నిలదీద్దాం
‘చంద్రబాబులా మనం మోసపూరిత వాగ్ధానాలు చేయలేదు. మూడు నెలల తర్వాత మీరే నా దగ్గరకు వచ్చి ప్రజలు ఇలా అడుగుతున్నారని చెబుతారు. మనకు అలాంటివి వద్దు. పూర్తిగా విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేద్దాం. అప్పుడే మనం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం. అధికారం దక్కించుకున్న టీడీపీకి, మనకు కేవలం 1.96 శాతం ఓట్లు మాత్రమే తేడా వచ్చాయి. ఇదేం పెద్ద తేడా కాదు. అధైర్య పడాల్సిన పనిలేదు.
భవిష్యత్తు మనదే. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీని పటిష్టం చేసుకుందాం. నిరంతరం ప్రజల్లోకి వెళ్దాం. రాబోయే రోజుల్లో మరింత గట్టిగా పనిచేయాలి. చంద్రబాబును నిలదీయూలి. ఇంటికో ఉద్యోగం అన్నా ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి రూ.2వేలు అరుునా ఇవ్వండి అని మనం డిమాండ్‌చేసి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. త్వరలో జరగబోయే యుద్ధానికి సమాయత్తం కావటానికే ఈ సమీక్షలు.
ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు ఎస్.రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ర్ట కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి నాని (గుడివాడ), జలీల్‌ఖాన్ (పశ్చిమ), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు కోనేరు రాజేంద్రప్రసాద్, పార్థసారథి, పార్టీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ (తూర్పు), పేర్ని నాని (మచిలీపట్నం), జోగి రమేష్ (మైలవరం), బూరగడ్డ వేదవ్యాస్ (పెడన), పార్టీ సమన్వయకర్తలు పి.గౌతమ్‌రెడ్డి (సెంట్రల్), మొండితోక జగన్‌మోహనరావు (నందిగామ), ఉప్పాల రాంప్రసాద్ (పెడన), పార్టీ నాయకులు అన్నె శ్రీనివాసకుమార్, కాజా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డెప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా కొడాలి నాని
‘మీ ఎమ్మెల్యే కొడాలి నానిని డెప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ను చేస్తున్నాం. నిత్యం జిల్లాలో మీకు అందుబాటులో ఉంటాం. అసెంబ్లీ సమావేశాల్లో డెప్యూటి ఫ్లోర్‌లీడర్ నా పక్కనే ఉంటారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాని దృష్టికి తీసుకురండి. సభలో వాటిపై మాట్లాడతాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడదాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.’
శ్రేణుల్లో నూతనోత్తేజం
జగన్‌ను చూస్తే చాలు.. ఆయనతో కరచాలనం చేస్తే చాలు.. అని భావించే పార్టీ కార్యకర్తలు నేరుగా ఆయనతో సమావేశం కావటం, అభిప్రాయాలను చెప్పే అవకాశం రావటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ తన సమీక్షలతో పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజనం నింపారు. నియోజకవర్గానికి పదులసంఖ్యలో కార్యకర్తలు, ముఖ్యనేతలు తమ పేరు, రాజకీయ నేపథ్యం జగన్‌కు వివరించి మాట్లాడారు. జగన్ కూడా సమీక్ష ప్రారంభానికి ముందు సుమారు వందమంది నాయకులు, కార్యకర్తల పేర్లు అడిగి తెలుసుకున్నారు. మధ్యమధ్యలో పేరు పెట్టి పిలిచి ‘మీరు మాట్లాడండి..’ అని అందరికీ అవకాశం ఇచ్చారు.
జగన్‌ను కలిసిన నేతలు
విజయవాడ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం ఉదయం పలువురు నేతలు కలిశారు. జిల్లాలో పార్టీ నియోజకవర్గాల సమీక్ష నిమిత్తం శుక్రవారం రాత్రి నగరానికి వ చ్చిన ఆయన బందరురోడ్డులోని రహదారులు-భవనాల శాఖ అతిథి గృహంలో బసచేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీమంత్రి, బందరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేసిన కొలుసు పార్థసారథితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి వంగవీటి రాధాకృష్ణతో పాటు కైకలూరు నుంచి పోటీచేసిన ఉప్పాల రామ్‌ప్రసాద్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు జగన్‌ను కలుసుకున్నారు.
జగన్‌ను కలిసిన చిత్తూరు నాయకులు
చిత్తూరు జిల్లా గంగాధర ఎమ్మెల్యే కె.నారాయణస్వామి, జెడ్పీ చైర్మన్ అభ్యర్ధి విజయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ ప్రసాదరెడ్డి, నాయకులు ఎస్.మోహన్‌కుమార్, ధనుంజయ్‌రెడ్డి, ప్రతాప్ తదితరులు జగన్‌ను కలిశారు.