పార్టీ పటిష్టతకే సమీక్షలు
సాక్షి, తిరుపతి: పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల సమీక్షకు వచ్చామని త్రిసభ్య కమిటీ సభ్యులు శంకరనారాయణ, గుర్నాథరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో పార్టీ ఎన్నికల గెలుపు ఓటములపై సమీక్ష జరిపేందుకు 14 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆదివారం ఉదయం తిరుపతిలోని పీఎల్‌ఆర్‌గ్రాండ్ హోట ల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి అధ్యక్షత వహించగా, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యు లు భూమన కరుణాక రరెడ్డి, ఎమ్మెల్యేలు చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి(చంద్రగిరి), అమరనాథరెడ్డి(పలమనేరు), తిప్పారెడ్డి(మదనపల్లె), సునీల్‌కుమార్(పూతలపట్టు), చింతలరామచంద్రారెడ్డి(పీలేరు)తో పాటు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ఆదిమూలం(సత్యవేడు), చంద్రమౌళి (కుప్పం), జంగాలపల్లి శ్రీనివాసులు(చిత్తూ రు) హాజరయ్యారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారు, పార్టీక్యాడర్ కూడా పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఈ సమావేశంలో తొలుత పరిశీలకులు శంకరనారాయణ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు విజయాలు, అపజయాలపై సమీక్షించేందుకు వచ్చామన్నారు. పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల అత్యధిక మెజారిటీతో గెలిచారని ఇందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయమే ఉదాహరణ అన్నారు. అలాగే మరికొన్ని చోట్ల అత్యధిక తేడాతో ఓడారని దీనికి కారణాలు ఏంటనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం వారితోనే ఉండి సమస్యలపై పోరాడుతున్నారన్నారు. మనపార్టీ బలాన్ని తగ్గించేందుకు, పార్టీ నుంచి చాలా మంది వె ళ్లిపోతారనే దుష్ర్పచారాన్ని టీడీపీ, వారి అనుకూల పత్రికలు పదే, పదే చేస్తున్నాయని వారి కల నెరవేరదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ తరహా ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మరో పరిశీలకులు బి.గుర్నాథరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అన్ని రకాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించేందుకే జగన్‌మోహన్‌రెడ్డి త్రిసభ్య కమిటీని నియమించారన్నారు.
నియోజకవర్గాల వారీగా సమీక్షించి వచ్చే సారాంశాన్ని నేరుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తామని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల్లో వైఫల్యాలకు సంబంధించి తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. పరిశీలకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను నియోజకవర్గాల వారీగా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్రమోడి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత ఉంటుందని ఊహించకపోవటం, కొన్ని చోట్ల రుణమాఫీ ప్రభావం కూడా పనిచేసిందన్నారు. అలాగే మనల్ని మనం కొన్ని చోట్ల అతిగా అంచనా వేసుకోవటం కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఓటమికి కారణమైందన్నారు.
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి రాకుండా చూసేందుకు అన్ని రాజకీయపార్టీలు, మీడియాలోని కొన్ని పత్రికలు పనిగట్టుకుని మూకుమ్ముడిగా అడ్డుకున్నాయన్నారు. క్యాడర్ క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేయబట్టే పార్టీకి పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే స్థానాలు దక్కాయన్నారు. రానున్న ఐదేళ్లు పార్టీ తరఫున ప్రజాసమస్యలపై నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. పార్టీ విప్ చెల్లుతుందనే విషయం కింది స్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపునకు పాల్పడాలని చూస్తే వారిపై విప్ జారీ చేస్తే అనర్హతకు గురవుతారనేది గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఎన్నికల సమీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్ సీపీ అనుబంధ ప్రజాసంఘాల నుంచి ఉదయ్‌కుమార్, గాయత్రిదేవి, బీరేంద్ర వర్మ, ఖాద్రీ పాల్గొన్నారు.