వెంకన్నపాలెం సమీపంలో సాయిలక్ష్మి బియ్యం మిల్లుపై అనకాపల్లి ఆర్డీఓ వసంతరాయుడు, ట్రెయినీ కలెక్టర్ భాస్కర్ గురువారం దాడి చేశారు.
- ఆర్డీఓ, ట్రెయినీ కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు
- వెయ్యి క్వింటాళ్ల బియ్యం, ధాన్యం, నూకలు స్వాధీనం
- 36 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తింపు... మిల్లు సీజ్
చోడవరం, న్యూస్‌లైన్ : వెంకన్నపాలెం సమీపంలో సాయిలక్ష్మి బియ్యం మిల్లుపై అనకాపల్లి ఆర్డీఓ వసంతరాయుడు, ట్రెయినీ కలెక్టర్ భాస్కర్ గురువారం దాడి చేశారు. అక్రమంగా నిల్వలు కలిగి ఉన్నారన్న సమాచారంతో అధికారులు ఆకస్మికంగా రైస్‌మిల్లుపై దాడి చేశారు. మిల్లులో నిల్వలను తనిఖీ చేశారు. ఈమేరకు ధాన్యం 205 క్వింటాళ్లు, బియ్యం 378 క్వింటాళ్లు, రేషన్ బియ్యం 36 క్వింటాళ్లు, బియ్యం నూకలు 428 క్వింటాళ్లు అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు 6-ఎ కింద కేసు నమోదు చేసి సరుకును, మిల్లును సీజ్ చేశారు. దాడిలో అదనపు పౌరసరఫరాల శాఖాధికారి మధుసూధరావు, చోడవరం డిప్యూటీ పౌర సరఫరాల శాఖాధికారి నానాజీ పాల్గొన్నారు. రేషన్ బియ్యంగా భావిస్తున్న 36 క్వింటాళ్లను పరిశీలిస్తున్నట్టు సీఎస్‌డీటీ విలేకరులకు తెలిపారు.