తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
ధరల సెగను చూపించిన బియ్యం ధరలు వారం రోజులుగా నేలచూపులు చూస్తున్నాయి. ఎగుమతులు మందగించడం, అంతర్జాతీయ విపణిలో రూపాయి బలపడ్డం తదితర కారణాలతో బియ్యం ధరలు తగ్గాయి. మరో పక్క కొత్త ధాన్యాలు మార్కెట్‌కు రావడం బియ్యం ధరలపై పడింది. ఇప్పటి వరకు ద క్షిణాఫ్రికా, మాల్దీవులు నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం ఎగుమతులు నిమిత్తం ఇచ్చిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారం సరుకులను ఆయా ప్రాంతాలకు ఒప్పందం ప్రకారం అందించాల్సి ఉంది. ఎగుమతులకు సంబంధించి ఇచ్చిన పర్మిట్ల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభుత్వం ఎగుమతుల కోసం పర్మిట్ల కాలాన్ని పొడిగిస్తేకాని సరుకులు వెళ్లే పరిస్థితి లేదు. ఈలోగా బియ్యం ధరలు అనూహ్యంగా తగ్గాయి. 25 శాతం నూకలు (బ్రోకెన్సు) ఉన్న 1010 రకం బియ్యం ఎగుమతి ధర క్వింటాలు రూ. 2170 నుంచి రూ. 2100 కు పడిపోయింది. ఐదు శాతం నూకలు ఉన్న బియ్యం ధర క్వింటాలు రూ. 2450 నుంచి రూ. 2380 కి తగ్గింది. ఈరకం బియ్యం కాకినాడ పోర్టు ద్వారా దక్షిణాఫ్రికా దేశాలకు, మాల్దీవులకు ఎగుమతి అవుతున్నాయి. ఈదేశాలకు కాకుంగా ఇటీవల కర్ణాటక పౌర సరఫరాల శాఖకు జిల్లా నుంచి బియ్యాన్ని ఎగుమతి చేశారు.
ప్రస్తుతం బియ్యం దక్షిణాఫ్రికా, మాల్దీవులకు ఎగుమతి అవుతున్నాయి, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలపడటంతో ఆ ప్రభావం బియ్యం ధరలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి మాదిరిగా ఇతర దేశాలలో ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండదని వారు అంటున్నారు. దీంతో డాలర్ హెచ్చు, తగ్గులను ప్రామాణికంగా తీసుకుని బియ్యం ఎగుమతుల ధరలను నిర్ణయిస్తుంటారు. డాలర్ మారకం విలువలో రూపాయి కొంత బలపడటం వల్ల ఎగుమతుల ధర తగ్గినట్టు చెబుతున్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50వేల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసినట్టు వ్యాపారులు తెలిపారు.
రిటైల్ మార్కెట్‌లోనూ...
రిటైల్ మార్కెట్‌లోనూ బియ్యం ధరలు తగ్గాయి. క్వింటాలు రూ. 4600 నుంచి రూ. 4800 అమ్మిన సోనా బియ్యం ధర రూ. 3600 నుంచి రూ. 3700 మధ్య పలుకుతోంది. స్వర్ణ బియ్యం క్వింటాలు రూ. 2700 నుంచి రూ. 2500కు తగ్గింది. పీఎల్ స్టీం రకం బియ్యం క్వింటాలు రూ. 2800 ఉంది. నెల్లూరు, తమిళనాడు నుంచి వస్తున్న స్టీం రకం సన్నాలను పీఎల్ స్టీం రకం సన్నాలుగా అమ్ముతూ బియ్యం వ్యాపారులు కొందరు వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ధాన్యాలు కట్టు,పొట్టు రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మిల్లుల్లో డ్రైయర్లు ఉన్న మిల్లర్లు మాత్రమే వీటిని కొంటున్నారు. డ్రై చేసే సరికి ఈధాన్యం క్వింటాలు రూ. 1150 గిట్టుబాటవుతోంది. క్వింటాలు ధాన్యం రైతుల దగ్గర నుంచి రూ. 820కి వ్యాపారస్తులు కొంటున్నారు.
బియ్యం ఇక చౌక
Published Sat, Sep 28 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement