జ్వరవాడ | risk of lack sanitation rings | Sakshi
Sakshi News home page

జ్వరవాడ

Published Fri, Jul 24 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

జ్వరవాడ

జ్వరవాడ

పారిశుధ్య లేమితో మోగుతున్న ప్రమాద ఘంటికలు
 

 పూడుకుపోతున్న డ్రెయిన్లు
 వర్షంతో ఇళ్లలోకి   ప్రవేశిస్తున్న మురుగు
 ఎక్కడి చెత్త అక్కడే..  నగరం.. వ్యాధులమయం

 
ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గుణదల, టీచర్స్ కాలనీ, బసవ తారకనగర్‌లో ఇప్పటికే మూడు మలేరియా కేసులు నమోదయ్యాయి. వన్‌టౌన్‌లోని ఫోర్‌మెన్ బంగళా, వించిపేట ప్రాంతాల్లో  విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె ప్రభావంతో చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. డ్రెయిన్లు పొంగి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డేంజర్ బెల్స్ మోగుతున్నా అధికారులు, పాలకుల్లో కనీస స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
విజయవాడ సెంట్రల్ : కార్పొరేషన్‌లోని అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో పారిశుధ్యం క్షీణించింది. డ్రెయిన్ల నుంచి దుర్గంధం వెదజల్లుతోంది. లోతట్టు ప్రాంతాల్లో మురుగు పొంగిపొర్లుతోంది. నగరంలో 1,194 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు ఉన్నాయి. రోజూ మూడు కోట్ల గాలన్లకుపైగా మురుగు నీరు ఉత్పత్తి అవుతోందని అంచనా. మొత్తం నీటి వినియోగంలో 80 శాతం తిరిగి మురుగునీరుగా మారుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రెయిన్ల నిర్వహణను గాలికి వదిలేశారు. వన్‌టౌన్‌లోని అనేక ప్రాంతాల్లో మురుగు మేట వేసింది. ఓపెన్ డ్రెయిన్లలో సిల్టు తొలగింపు ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. వీధుల్లోని సైడ్ కాల్వల చెత్త ప్రధాన డ్రెయిన్లకు చేరింది. రామవరప్పాడు, గుణదల ఈఎస్‌ఐ, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లలో డ్రెయినేజీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మురుగు మరింత ముంచెత్తుతోంది. డ్రెయిన్ల పూడికతీతకు ఈ ఏడాది రూ.1.28కోట్లు కేటాయించారు. వేసవి ముగుస్తున్న తరుణంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అరకొరగా చేసి వది లేశారు. 30 శాతం కూడా సిల్టు తొలగించలేదు. దీంతో శివారు ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి.

చెత్త తొలగింపు అరకొరే..
 నగరంలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 150 టన్నుల్ని కూడా డంపింగ్ యార్డుకు పంపలేని పరిస్థితి నెలకొంది. బందరు, ఏలూరు రోడ్లను స్వీపింగ్ మిషన్‌తో శుభ్రం చేస్తున్నారు. గంటకు నాలుగు కిలోమీటర్లు శుభ్రంచేసే సామర్థ్యం ఈ మిషన్‌కు ఉంది. రాత్రి ప్రారంభించి తెల్లవారే వరకు ఈ రెండు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లు  (పీహెచ్) 810 మందికి గానూ 600 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. డెప్యూటేషన్లను రద్దు చేసినప్పటికీ కార్మికులు ఆయా విభాగాలను వదిలి రావడం లేదు. డంపర్ బిన్లు, ఎక్కువ మొత్తంలో వేసిన చెత్తను మాత్రమే తొలగిస్తున్నారు. మురికివాడల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఔట్‌సోర్సింగ్ కార్మికుల ప్రతిఘటన నేపథ్యంలో పారిశుధ్య విధులు నిర్వర్తించేందుకు కాంట్రాక్ట్ కార్మికులు ముందుకు రావడం లేదు.

 స్పందన నిల్
 స్వచ్ఛభారత్ స్ఫూర్తితో పారిశుధ్య పనుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలన్న కమిషనర్ పాచిక పారలేదు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, స్వచ్ఛభారత్ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం కొరవడింది. పారిశుధ్య పనుల్లో భాగం పంచుకొనేందుకు వారు మొహం చాటేస్తున్నారు. కాలనీవాసులు, రెండుమూడు ప్రాంతాల వారు కలిసి పారిశుధ్య పనులు చేసేందుకు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటే రోజుకు రూ.275 చొప్పున చెల్లిస్తామని మేయర్ కోనేరు శ్రీధర్ చేసిన ప్రకటనకు ఏమాత్రం స్పందన లేదు. చిత్తు కాగితాలు ఏరుకునే వారితో ఇటీవల ప్రజారోగ్యశాఖ అధికారులు సంప్రదింపులు జరపగా కాగితాలు ఏరుకుంటే రోజుకు రూ.500 వస్తోందని వారు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. తాత్కాలిక పనికి రూ.275 గిట్టుబాటు కాదని పలువురు కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement