నదులు కబ్జా | Rivers capture | Sakshi
Sakshi News home page

నదులు కబ్జా

Published Fri, Feb 13 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

Rivers capture

ఆక్రమణలకు గురైన తుంగభద్ర, హంద్రీ నదులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు రెవెన్యూ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులదే రాజ్యం మరుగున పడిన రూ. 244.7 కోట్ల  రక్షణ గోడల నిర్మాణ ప్రతిపాదనలు
 
కర్నూలు : కర్నూలులోని ప్రధాన నదులు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. అక్రమార్కులు తుంగభద్ర, హంద్రీ నదుల్లోకి చొరబడి.. ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర, హంద్రీ నదుల్లో పెద్దపెద్ద భవంతులు వెలిశాయి. కర్నూలు నగరం నడిబొడ్డున హంద్రీ నది ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే చాలు ఈ నది ఉప్పొంగి ప్రవహించి లోతట్టు కాలనీలను ముంచేస్తుంది. ఇందుకు కారణం ఈ నది భారీగా ఆక్రమణలకు గురికావడమేనని స్పష్టంగా అర్థమవుతోంది. విశాలంగా ఉన్న నది ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది. దీంతో ప్రవాహం పెరిగి లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఎగువన లక్ష్మీపురం నుంచి దిగువన కల్లూరు మీదుగా హంద్రీ నది కర్నూలులోని  జొహరాపురం వరకు ప్రవహించి ఆ తరువాత తుంగభద్రలో కలుస్తుంది. కల్లూరులోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ నుంచి జొహరాపురం వరకు అక్రమార్కులు భారీగా నదిని ఆక్రమించేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో నది భూముల్లో భారీ భవంతులు, ఫంక్షన్‌హాళ్లు నిర్మించుకున్నారు.
 
తుంగదీ అదే దుస్థితి...


మరో పక్క తుంగభద్ర నది పరిస్థితి ఇలాగే ఉంది. కర్నూలు శివారులో రోజా దర్గా ప్రాంతం నుంచి నగరంలోకి ప్రవేశించే తుంగభద్రకు పాతబస్తీ మీదుగా జొహరాపురం వరకు వివిధ ప్రాంతాల్లో నది కబ్జాకు గురైంది. ఈ పరిస్థితుల ప్రభావంతోనే 2007, 2009 ప్రాంతాల్లో వరద కర్నూలుని ముంచేసింది. ఫలితంగా భారీగా ఆస్తి, ఆర్థిక నష్టాలు వాటిల్లాయి. హంద్రీ పొడవున 7.71 కిలోమీటర్లు, తుంగభద్ర పొడవున 4 కిలోమీటర్లు వరద రక్షణ గోడలు నిర్మించాలని 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఇందుకులో రూ. 244.7 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమైనా డిజైన్ మార్పు, అంచనా వ్యయాలు పెరగడంతో ఆ పనులు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో రక్షణ గోడలు నిర్మాణాలకు నోచుకోలేదు. ఇదిలాగుంటే నదుల్లో ఆక్రమ నిర్మాణాలు, కబ్జాలపై కొరడా ఝళిపించాల్సిన నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపం కరువైంది. కబ్జాదారులకి నోటీసులిచ్చి, రెవెన్యూ అధికారులకి నదీ భూములకు సంబంధించిన మార్కింగ్‌లు గుర్తించమని చెప్పిన నీటిపారుదల శాఖ ఇంతటితో తమ పనైపోయిందని చేతులు దులుపుకుంది. ఇటు రక్షణ గోడల నిర్మాణానికి నోచుకోక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

కదలిక లేని ప్యాకేజీ-1,2,3,4,5 పనులు..

వరదల నుంచి కర్నూలు నగరానికి రక్షణ కల్పించడానికి తుంగభద్ర, హంద్రీ నదులకు కరకట్టలు, రక్షణ గోడలు నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండేళ్ల కింద రూ.244.7 కోట్ల నిధులు కేటాయించారు. 2008 డిసెంబర్ 11న ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సకాలంలో సాంకేతికపర అనుమతులు రాకపోవడం, బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో ఫ్లడ్‌వాల్స్ ప్రాజెక్టు నిర్మాణం నేటికీ ఒక కొలిక్కిరాలేదు. అప్పట్లో తుంగభద్ర, హంద్రీ నదీ తీరంలో రక్షణ గోడలు, కరకట్టల నిర్మాణం పనులను త్వరగా పూర్తి అయ్యే విధంగా ఐదు ప్యాకేజీలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్లకు కేటారుుంచాలని అధికారులు నిర్ణయుం తీసుకున్నారు. వీటిలో 1,2 ప్యాకేజీలను 2008లోనే ఈపీసీ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఒప్పందం కుదిరిన వెనువెంటనే పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు తాత్సారం చేయడం.. మిగిలిన ప్యాకేజీ-3,4,5లకు సంబంధించిన పనులు సాంకేతిక పరమైన అనుమతులు రాకపోవడంతో దాదాపు ఆరేళ్లు గడిచినా ఆ పనులేవీ ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. అనంతరం వాటి అంచనా వ్యయం రూ. 954 కోట్లకు పెరిగింది. పెరిగిన అంచనా వ్యయంతో 2013-14 ఆర్థిక సంవత్సానికి బడ్జెట్ ప్రతిపాదనలను నీటిపారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

అయితే ఆ ప్రతిపాదనలు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తిరస్కరిస్తూ 2008లో ఆమోదించిన బడ్జెట్‌లోనే పనులు చేపట్టాలని, అందుకు కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. దీంతో ఆ ఏడాది కూడా ఈ పనులకు కేటాయింపులు జరగలేదు. తాజాగా నీటిపారుదల శాఖాధికారులు 7 పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు. అందులో హంద్రీ నదిపై రెండుచోట్ల, తుంగభద్ర నదిపై ఒక ప్రాంతంలో రక్షణ గోడల నిర్మాణాలు,  జొహరాపురం, ఆనంద్ థియేటర్ వద్దబ్రిడ్జిల నిర్మాణం, సుద్ద వాగు 0 కి.మీ నుంచి 1.75 కి.మీ వరకు కాంక్రీట్ గోడల నిర్మాణం, కల్లూరులోని జాతీయ రహదారి వద్ద నుంచి తుంగభద్ర, హంద్రీ నదులు కలిసే పాయింట్ వరకు  నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా నదిని 5.5 కి.మీ మేర సమానంగా చదును చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement