
లోకేశ్ ఆస్తులు 22 రేట్లు ఎలా పెరిగాయి?
తిరుపతి: టీడీపీ మహానాడు వెన్నుపోటు మహానాడుగా మారిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహానాడు అబద్దాలకు వేదికైందని.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానక్షోభకు గురయ్యారో చర్చించివుంటే బాగుండేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, పెద్దాయనకు భారతరత్న ఇప్పించడంలో టీటీడీ కృషి చేయడం లేదని అన్నారు. ఏ ఒక్క పథకాన్ని చంద్రబాబు సరిగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సిగ్గులేకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు.
మహానాడులో చేసిన తీర్మానాలు ఏ ఒక్కటి అమలు కావడం లేదని తెలిపారు. ఓట్లు కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఇప్పటివరకు రాజధానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. అవినీతిరహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉందని ఎన్‌సీఈఆర్సీ సర్వే తేల్చిందని గుర్తు చేశారు. ఐదు నెలల్లో నారా లోకేశ్ ఆస్తులు 22 రేట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. చంద్రబాబు హత్యారాజకీయాలకు తెర లేపారని, హత్యలను అడ్డుకోవడంలో టీడీపీ సర్కారు విఫలమైందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.