అత్తవారింటికెళ్తూ...అనంత లోకాలకు
Published Fri, Nov 8 2013 3:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
చీపురుపల్లి రూరల్/తెర్లాం, న్యూస్‌లైన్: పండగంటిపూట భార్యాబిడ్డలతో అత్తవారింట ఆనందంగా గడుపుదామనుకుని ఎన్నో ఆశలతో బయలు దేరిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహన ప్రమాదంలో అనంత లోకాలకు చేరుకున్నాడు. గురువారం జరిగిన ఈ దుర్ఘటన పలువురిని కలిచివేచింది. తెర్లాం మండల పరిధిలోని డి.గదబవలసకు చెందిన జావాన రమేష్(28) చీపురుపల్లి మండలం పేరిపిలో అత్తవారింటికి తన సమీప బంధువు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన బూరాడ వెంకటరమణతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
వారు ప్రయాణిస్తున్న వాహనం చీపురుపల్లి-సుభద్రాపురం ప్రధాన రహదారిలో యలకలపేట కూడ లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న రమేష్ మర్మావయవాలపై బలమైన దెబ్బ తగలడంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వాహనం నడుపుతున్న వెంకటరమణకు ఎడమకాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని 108కు స్థానికులు సమాచారం అందించగా వెంకటరమణను మెరుగైన చికిత్సకోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. రమేష్‌కు రెండున్నరేళ్ల క్రితం పేరిపికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వారికి 6నెలల వయస్సుగల చిన్నారి ఢిల్లీశ్వరి ఉంది.
ఇంటర్మీడియెట్ చదువుకున్న రమేష్ ఉపాధి కోసం వైజాగ్‌లో పనులు చేసుకుంటూ కాలంవెళ్లదీస్తున్నాడు. నాగులచవితి పూజలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి గదబవలసకు వచ్చాడు. గురువారం ఉద యం నాగులచవితి పూజలు ముగించుకుని రెండో పూట అత్తవారింటికి బయలు దేరివెళ్లాడు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు జావాన రామారావు, అప్పలస్వామిలు తెలిపారు. చేతికందికొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని భార్య, బిడ్డతోపాటు తమను ఆదుకునే నాథుడు లేడని రమేష్ తల్లిదండ్రులు సూర్యనారాయణ, అప్పలనర్సమ్మలు రోదిస్తున్నారు. నలుగురితో కలివిడిగా ఉంటూ ఇలా వాహన ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement