పసిబిడ్డను చూడకుండానే.. | Road accident in Dongaravipalem | Sakshi
Sakshi News home page

పసిబిడ్డను చూడకుండానే..

Published Mon, Dec 15 2014 12:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

పసిబిడ్డను చూడకుండానే.. - Sakshi

పసిబిడ్డను చూడకుండానే..

 దొంగరావిపాలెం(పెనుగొండ రూరల్) :వారసుడు పుట్టాడనే ఆనందంతో బయలుదేరిన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఐదు రోజుల క్రితం జన్మించిన కుమారుడిని చూసేందుకు తహతహతో బయలుదేరిన తండ్రి, వారసుడిని చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్న తాతా, నానమ్మ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయరహదారిపై ఆదివారం వేకువ జామున కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ లాసన్స్‌డే ప్రాంతానికి చెందిన చల్లా గంగునాయుడు(55), చల్లా పార్వతమ్మ(50) దంపతులు, వారి కుమారుడు చల్లా అరుణకుమార్(30) అక్కడిక్కడే మరణించారు. అరుణకుమార్ చెల్లెలు చల్లా సునీత, స్నేహితుడు యు.చలపతికి తీవ్ర గాయాలయ్యాయి.
 
 విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అరుణకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతూ ఒవర్ టెక్ చేసే సమయంలోగానీ, కునుకు పట్టడంతోగానీ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సునీత, చలపతిని తణుకు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ప్రమాదం వేకువజాము 4, 5 గంటల మధ్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారు కావడంతో ఇక్కడ జన సంచారం లేదు. అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సమాచారం అందించడంతో పెనుగొండ ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 ఉద్యోగంలో చేరకుండానే
 అరుణకుమార్ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ వద్ద విశాఖపట్నంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అతని తండ్రి గంగునాయుడు కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో అరుణకుమార్‌కు కేజీహెచ్‌లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండటంతో కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం మాసేశాడు. ఈ లోపునే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
 ఓ ప్రమాదంలో కాళ్లు,
 
 మరో ప్రమాదంలో ప్రాణాలు
 చల్లా గంగునాయుడు జీవితం ప్రమాదాలతోనే గడిచిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఐదేళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కర్రల ఊతంతో మాత్రమే కదలగలడు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొడుకును ఉద్యోగంలో చేర్చాలని ఆశపడ్డారు. ఎట్టకేలకు కుమారుడికి కారుణ్య నియామకం కింద అనుమతులు వచ్చిన తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలన్న ఆశ తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వారసుడైన మనవడిని కూడా చూడకుండానే వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు.
 
 ఏడాది క్రితమే వివాహం విశాఖపట్నానికి
 చెందిన చల్లా అరుణకుమార్‌కు ఏడాది క్రితం నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన అరుసుమిల్లి కూర్మారావు రెండో కుమార్తె నళినితో వివాహమైంది. ఆమె ఐదు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసవించింది. కుమారుడు పుట్టాడు. శని, ఆది వారాలు సెలవు కావడంతో అందరికీ వెసులుబాటు ఉంటుందని కుమారుడిని చూడటానికి తల్లి, తండ్రి, చెల్లి, స్నేహితుడితో కారులో తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివాహమైన ఏడాదిలోనే అల్లుడుని కోల్పోయామంటూ కూర్మారావు కన్నీరుమున్నీరయ్యారు. పచ్చి బాలింతరాలైన కుమార్తెకు అల్లుడి మరణ వార్త  ఎలా చెప్పాలంటూ విలవిల్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement