రోడ్ టై | Articles about Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్ టై

Published Tue, Feb 10 2015 2:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రోడ్ టై - Sakshi

రోడ్ టై

జిల్లాలోని రహదారులు మృత్యుమార్గాలుగా మారాయి. జాతీయ, రాష్ట్ర, జెడ్పీ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండగా వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇటీవల తాడేపల్లిగూడెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, ద్వారకాతిరుమల మండలంలో జరిగిన ప్రమాదంలో న్యూస్ ప్రెజంటర్ బద్రి, ఆయన కుమారుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
 
 ప్రమాదకరంగా కాలువ గట్లు
 భీమవరం అర్బన్ : భీమవరం సమీపంలోని కాలువగట్లు, మురుగు డ్రెయిన్ల పక్కన ఉన్న రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. గతంలో కార్లు అదుపుతప్పి పంట కాలువలు, మురుగు డ్రెయిన్లలోకి దూసుకుపోవడంతో పలువురు మృత్యువాత పడ్డారు. 2011 జనవరి 15న భీమవరం శివారున ఉన్న జీ అండ్ వీ కెనాల్‌లోకి కారు దూసుకుపోవడంతో  6 గురు మృతిచెందారు. ఉండి రోడ్డులోని మురుగు డ్రెయిన్‌లోకి కారు దూసుకుపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. సీఫుడ్స్ కంపెనీలకు చెందిన బస్సులు కూడా అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయిన ఘటనలు కోకొల్లలు.  కాలువ గట్లకు రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
 ప్రమాదాలకు నిలయంగా పెరవలి సెంటర్
 పెరవలి : జాతీయ రహదారిపై పెరవలి సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడేళ్లలో పోలీసు రికార్డుల ప్రకారం పెరవలి పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా 118 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది 7 ప్రమాదాలు జరగ్గా నలుగురు చనిపోయారు. 8 మంది క్షతగాత్రులయ్యారు. రహదారులు సక్రమంగా లేకపోవడం, మార్జిన్‌లు లేకపోవడం, రహదారి నిబంధనలను అధికారులు అమలు చేయకపోవడం, వాహనదారులు పాటించకపోవడం ప్రధాన కారణాలు. జాతీయ రహదారిపై గ్రామ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్‌లు ప్రమాదాలకు పిలుపుగా మారాయి.  ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా నివారణకు అధికారులు పట్టించుకోవడం లేదు.
 
 రహదారులు రక్తసిక్తం
 ఏలూరు (వన్‌టౌన్) : జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జెడ్పీ రహదారులు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. రెప్పపాటు కాలంలో ప్రాణాలను హరిస్తున్నాయి. మిరిమీరిన వేగం, నిద్రలేమి, ఓవర్ టేక్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి లోపాలు, అధికారుల పర్యవేక్షణ లేమి.. కారణం ఏదైతేనే.. ఏటా జిల్లాలోని రోడ్డు ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది వైకల్యం పొందుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వాహనాల వేగాన్ని నిరోధించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం కూడా ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణమవుతుంది.   
 
 అతివేగం, నిర్లక్ష్యం వల్లే  : ట్రాఫిక్ డీఎస్పీ
 నిర్లక్ష్యం, మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని  ఏలూరు ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తెలిపారు. రోడ్డు నిర్మాణ లోపం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు బైక్‌లు కొనిస్తున్నారు కాని వారిపై పర్యవేక్షణ ఉంచడం లేదు. ముగ్గురేసి కలిసి ఒకే బండిపై ప్రయాణం చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రయోజనం ఉండడం లేదు. కొంతమంది యువకులు రేసులకు కూడా పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు ఇంటివద్దే జాగ్రత్తలు తీసుకుని వారిని కట్టడి చేయాలి.    నిబంధనలను మీరితే ఉపేక్షించేది లేదు.
 
 అతివేగంతో ప్రాణాలు గాలిలోకి..
 చింతలపూడి : అతివేగం, త్వరగా గమ్యస్థానాన్ని చేరాలన్న ఆతృతతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో కొన్నాళ్లుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. చింతలపూడి మండలం సీతానగరం వద్ద రెండేళ్ల క్రితం అరటి గెలలతో వేగంగా వస్తున్న లారీ బోల్తా పడ్డ ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. 2013 మేలో రేచర్ల మాజీ సర్పంచ్ కంచర్ల నాగేశ్వరర్రావును వ్యాన్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. 2012 మార్చి 18న చింతలపూడి సమీపంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆర్టీసీ బస్ బోల్తా పడిన ఘటనలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. గతేడాది లింగపాలెం సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో చింతలపూడి మండల ం, ఊట సముద్రం మాజీ సర్పంచ్ అప్పిరెడ్డి దుర్గారావుతో సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లినగర్ సమీపంలోని మలుపులో అదే ఏడాది ఆర్టీసీ బస్ మోటర్ బైక్‌ను ఢీకొట్టడంతో ధర్మాజీగూడెంకు చెందిన ఇద్దరు వ్యకులు అక్కడికక్కడే మృతి చెందారు.   లెసైన్స్ లేని వారు, రహదారి నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్నారు.
 
 4 రోజులు.. 3 ప్రమాదాలు.. 5 ప్రాణాలు
 తాడేపల్లిగూడెం : ఈ అంకెలు చాలు తాడేపల్లిగూడెం ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో చెప్పడానికి. పదహారో నంబర్ జాతీయ రహదారి గూడెం పరిధిలో నిత్యం ఎదో ఒక చోట రక్తసిక్తమవుతోంది. అతి వేగం, త్వరగా గమ్యాన్ని చేరాలన్న ఆతృత, నిద్రలేమి, ఓవర్‌టేక్‌లు, రహదారి నిర్మాణంలో లోపాలే రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. క్షణాల్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఆయా కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగులుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి పెంటపాడు మండలం ప్రత్తిపాడు జంక్షన్ వద్ద లారీ-బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు 12 గంటల ముందు గురువారం మధ్యాహ్నం పెదతాడేపల్లి బెస్ట్ కళాశాల సమీపంలో పెళ్లిబృందంలో వెళుతున్న వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 13 మందికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనల్లో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఓ వ్యక్తి  మృతి చెందాడు. ఆదివారం రాత్రి గూడెంలో మోటారు సైకిల్‌పై వెళుతూ ఓ యువకుడు డివైడర్‌ను ఢీకొట్టి మరణించాడు.  
 
 రెండు రోజులు హడావుడి..
 ఆ తర్వాత మామూలే.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలుగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణకు తూతూమంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు కొత్త కాదు, ఇవి కోకొల్లలు. వీటి నియంత్రణ, రక్షణ చర్యలే ముఖ్యం. ఇవన్నీ ప్రతిపాదనలుగా గాలిలో ఉంటున్నాయి. వీటికి సంబంధించి రూపొందించిన సూచనలు ఫైళ్లకే పరిమితమవుతున్నాయి. జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో సాంకేతిక తప్పిదాలు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. రహదారి నిర్మాణంలో రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల ఇంజినీర్లు రూపొందించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోవడం ప్రజలకు శాపంగా మారింది. అందువల్ల జిల్లాలో ఏలూరు నుంచి పెరవలి వరకు జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తమవుతోంది. వాహనాల వేగం తెలుసు కోడానికి స్పీడ్ మెజరింగ్ లేజర్ గన్స్ అందుబాటులో ఉండాలి. లారీ 80 కిలోమీటర్ల వేగం మించి వెళ్లకూడదు. బస్సు వేగం 80 కిలోమీటర్లు, కారు వేగం 100 కిలోమీటర్లు. ప్రత్తిపాడు వంటి జంక్షన్ల వద్ద వాహనాల వేగం 25 కిలోమీటర్లు ఉండాలి. ఈ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. వీటిని రవాణా శాఖ అధికారులూ పట్టించుకోవడం లేదు. ప్రత్తిపాడు జంక్షన్ వద్ద రోడ్డు ఏటవాలుగా నిర్మించారు. దీంతో అక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
 
 అటకెక్కిన పెంటపాటి పుల్లారావు ప్రతిపాదనలు
 జాతీయ భద్రతా కౌన్సిల్ సలహాదారుగా, హ్యూమన్ రైట్స్ ఫారం బాధ్యుడిగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు రహదారి ప్రమాదాలపై గతంలో అధ్యయనం చేశారు. రహదారి పొడవునా యాక్సిడెంటు ప్రోన్ ఏరియా బోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్డు పక్కగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని, హైవే వాహన వేగం తెలుసుకోడానికి స్పీడ్ కెమెరాల రికార్డింగ్ ఉండాలని, రహదారి పక్కగా ఇళ్లున్న ప్రాంతాల్లో గడ్డర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి వంతున డ్రైవర్లకు విశ్రాంతి మందిరాలు ఉండాలని సూచించారు. అయితే ఇవి ఆమలుకు నోచుకోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement