తరుముకొచ్చిన మృత్యువు
Published Fri, Aug 30 2013 3:37 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
చిన్నక్క.. నువ్వు ఉండు.. నేను వెళ్లి చికెన్ తీసుకువస్తాను.. నేను వచ్చే లోపు వన భోజనానికి అందరూ తయారుగా ఉండాలి...సరేనా..! అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ బాలుడు.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడు..లారీ మృత్యురూపంలో వచ్చి అతన్ని కబళించింది. వనభోజనాల సందర్భంగా ఊరంతా సందడి నెలకొన్న రోజున ఉన్నట్టుండి విషాదం అలుముకుంది.
ఖమ్మం అర్చన్, న్యూస్‌లైన్:శ్రావణ మాసం సందర్భంగా రఘునాధపాలెం మండలం శివాయిగూడెం గ్రామస్తులు సమీపంలోని టేకుతోటలో వనభోజన కార్యక్రమానికి పయనమయ్యారు. గ్రామానికి చెందిన బాలుడు నండ్రు త్రినాథ్(10) కూడా వనభోజనానికి వెళ్దామని ఇంట్లో గొడవ చేశాడు. అయితే అమ్మ కవిత, నాయనమ్మ లక్ష్మి అందుకు ఒప్పుకోలేదు. ఏడ్చి.. అల్లరిచేసి చివరికి కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అప్పుడే చికెన్ తీసుకురావడానికి బయలుదేరిన అక్క అనితను ఆపి, నువ్వు వెళ్లి వచ్చేసరికి ఆలస్యమవుతుందని, నేను వెళ్లి తీసుకువస్తానని, నేను వచ్చేసరికి అందరూ తయారుగా ఉండాలని చెప్పి, అక్క చేతిలో బుట్ట తీసుకుని సెంటర్‌కు బయలుదేరాడు.
మంచుకొండలో చికెన్ తీసుకుని తిరుగుప్రయాణంలో బస్సులో శివాయిగూడెం చేరుకున్నాడు. బస్సు దిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డు దాడుతుండగా, ఖమ్మం నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టించింది. తమ్ముడు.. తమ్ముడు.. అంటూ అక్కలు ప్రియాంక, అనిత రోదిస్తున్న తీరు అక్కడున్నవారిని శోకసంద్రంలో ముంచెత్తింది. త్రినాథ్ తండ్రి సైదులు ఐదేళ్ల క్రితం కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి అతని తల్లి కవిత కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
మనవడు ఒక్క క్షణం కనిపించకపోతేనే నాయనమ్మ విలవిలలాడిపోతుందని, మనవడు అంటే మురిపమని, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి? అని గ్రామస్తులు ఆవేదనతో చెప్పారు. త్రినాథ్ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. త్రినాథ్ మరణంతో వనభోజన సందడిలో ఉన్న గ్రామంలో విషాద వాతావరణ అలుముకుంది. త్రినాథ్ మృతదేహాన్ని గ్రామసర్పంచ్ బానోత్ నాగమణి, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గార్లపాటి శ్రీనివాస్‌రావు తదితరులు సందర్శించి విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలిని ఎస్సై గణేష్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement