సాక్షి, తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని మలికిపురం మండలం మట్టపర్తి గ్రామానికి చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంపై తుని సమీపంలోని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ధర్మవరం వద్ద నిద్రమత్తు రావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చెల్లుబోయిన మరిడియ్య (36) (డ్రైవర్), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపర్తి ఏడుకొండలు (42) మృతి చెందారు.
వీరిలో మట్టపర్తి ఏడుకొండలు పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామస్తుడు. ప్రమాదంలో మట్టపర్తి గ్రామానికి చెందిన బొంతు సత్య శ్రీనివాసరావు, కాదాల సత్యనారాయణ, కలుకలంక కృష్ణ, వెండ్ర రమేష్, చెల్లుబోయిన శివప్రసాద్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, మండ్ర హరికృష్ణ, రాపాక సారంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్‌ఐ రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment