దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ :కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో జరుగుతున్న పూజకు పత్రిని తీసుకు వచ్చేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.ఈ సంఘటనతో దోసకాయలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ఉరుము రామారావు(48) ఆదివారం పత్రి తెచ్చేందుకు బూరుగుపూడి గేట్ సమీపంలోని మర్రి చెట్ల వద్దకు వచ్చాడు. మర్రి, ఇతర చెట్ల ఆకులు కోసుకుని వాటిని పోగు చేస్తూ ఉండగా క్వారీ క్రషర్ నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య ఉంది. కూలిపనే జీవనాధారంగా అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. రామారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ పూట ఆ ఇంట దారుణమైన దుఃఖం నెలకొనడం బాధాకరమని పలువురు వాపోయారు. కోరుకొండ ఎస్సై బి.వేంకటేశ్వరరావు సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లారీని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ పరారీలో వున్నాడు.
సర్పంచ్ సూర్యకుమారి తదిరతరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రాజమండ్రి తరలించారు. రాజమండ్రి-కోరుకొండ-రాజానగరం రోడ్లలో క్వారీ రాళ్లను రవాణా చేసే లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నాగంపల్లి నుంచి రాజమండ్రి రోడ్లలో రాత్రి పగలు తేడా లేకుండా క్వారీలారీలు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పత్రికి వెళ్లి ప్రమాదానికి బలి
Published Mon, Nov 18 2013 1:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement