ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 46,440 కిలోమీటర్ల మేజర్ రహదారులను ప్రధాన రోడ్లకు అనుసంధానిస్తూ జాతీయ రహదారులకు కలిపేలా ప్రణాళికలు తయూరు చేశారు. రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులకు రహదారులను అనుసంధానించి కారిడార్లుగా వినియోగించుకునేలా అంచనాలు రూపొందించారు. వైఎస్సార్ జిల్లా, కర్నూ లు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి నూతన రాజధాని విజయవాడకు రోడ్డు వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రతిపాదనల్లో సింహభాగం స్థానం కల్పించినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
600 కి.మీ. జాతీయ రహదారులుగా మార్చండి
రాష్ట్రంలో 4,302 కి.మీ. మేర జాతీయ రహదారులున్నాయి. ప్రధానంగా ఓడరేవుల నుంచి జాతీయ రహదారుల వరకు రోడ్డును అనుసంధానిస్తూ జాతీయ రహదారులుగా మార్చాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 600 కి.మీ. మేర రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చాలని ఇటీవలే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ప్రతిపాదనలు అందచేశారు.